గెలిచినోళ్లు ఇట్ల.. ఓడినోళ్లు అట్ల

గెలిచినోళ్లు ఇట్ల.. ఓడినోళ్లు అట్ల

మోడీకి సవాళ్ల స్వాగతం.. పాలనపై దృష్టి    ‘పవర్‌‌’ పాలిటిక్స్‌‌లోకి అమిత్ షా

న్యూఢిల్లీలోక్​సభ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. బీజేపీ తిరుగులేని విజయం సాధించింది. ప్రతిపక్షాలకు కళ్లు బైర్లుకమ్మాయి. గెలుపు సంబురాల్లో బీజేపీ ఉంటే, నిరాశలో అపొజిషన్స్ ఉన్నాయి. మళ్లా ఎన్నికలకు ఐదేళ్లుంది. అప్పటి వరకు ముఖ్య నేతలు ఏం చేస్తరు? గెలిచినోళ్లు ఎలా ముందుకు పోతరు? ఓడినోళ్ల పరిస్థితేంటి? వ్యూహాలేంటి?

ప్రధాని మోడీ

అప్పుడు చాయ్ వాలా.. ఇప్పుడు చౌకీదార్. జాతీయ రాజకీయాల్లో, పరిపాలనలో మోడీకి ప్రారంభంగా తొలి ఐదేళ్ల కాలం (2014–2019) గడిచిపోయింది. రెండోసారి ప్రధాని పీఠమెక్కనున్న మోడీకి సవాళ్లు ఎదురుకానున్నాయి. ఆయన పాలనకు రానున్న ఐదేళ్లు పరీక్షగా నిలవనున్నాయి. ‘మోడీ 2.0.’కు టైమ్ ఇది. పాలనపై దృష్టి పెట్టాలి. ఎకానమీ నుంచి ఫారిన్ పాలసీ వరకు ఎంతో చేయాల్సి ఉంది. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఇందులో సాకులు చెప్పేందుకు లేదు. రాజకీయ భాగస్వాములతో సంబంధాలు మరింత మెరుగుపరుచుకోవాలి. అంతా తానే అన్నట్లు కాకుండా, బీజేపీని కూడా బలోపేతం చేయాలి. మారుతున్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగాలి. అలాగే ‘వ్యక్తి పూజ’ ఉండకుండా చూసుకోవాలి.

అమిత్ షా

అమిత్ షా.. వ్యూహాల మాస్టర్. బీజేపీలో నంబర్ 2. రెండోసారి మోడీని ప్రధాని పదవిలో కూర్చోబెట్టి మాస్టర్ స్ట్రాటజిస్ట్​గా  నిరూపించుకున్నారు. ‘నరేంద్ర మోడీ’ బ్రాండ్​ను ప్రతి ఇంటికి తీసుకెళ్లారు. తాజా ఫలితాలతో నంబర్2 స్థానాన్ని అలాగే పదిలంగా ఉంచుకోనున్నారు. తొలిసారి లోక్​సభ ఎన్నికల్లో గెలిచారు. ఒకవేళ పార్టీని లీడ్ చేయమని మోడీ ఆదేశించకుంటే, ఆయనకు కేబినెట్​లో టాప్ పొజిషన్ దక్కే అవకాశం ఉంది. సిటిజెన్​షిప్ అమెండ్​మెంట్ బిల్లు లేదా ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370 బిల్లుల విషయంలో ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువ. ఇన్నాళ్లూ తెర వెనుక ఉన్న ఆయన వచ్చే ఐదేళ్లు పాలిటిక్స్, పబ్లిక్ లైఫ్​లో బిజీ కానున్నారు.

అఖిలేశ్, మాయావతి

బీజేపీ దెబ్బకు బీఎస్పీ–ఎస్పీ కూటమి కూలిపోయింది. అఖిలేశ్, మాయావతి ఇద్దరూ ఓటింగ్​పై విశ్లేషించుకోవాలి. కలిసి పని చేయడం వల్ల ప్రయోజనం ఉందా లేదా అనే దానిపై తర్వాత నిర్ణయం తీసుకోవాలి. బీఎస్పీకి ఎక్కువ సీట్లు ఇవ్వడంపై సొంత పార్టీ ఎస్పీ నుంచే అఖిలేశ్ కు ​విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తన తండ్రి ములాయం క్యాంపు నేతలు ఎక్కువగా మాటల దాడి చేయొచ్చు. వరుసగా నాలుగు ఎన్నికల ఓటములను చవిచూసిన
మాయావతికి ఇది పెద్ద దెబ్బ. రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు తనను తాను అప్​డేట్ చేసుకోవాల్సిన సమయం.

మమతా బెనర్జీ

ఇండియన్ పాలిటిక్స్​లో ‘స్ర్టీట్ ఫైటర్’ ఎవరన్నా ఉన్నారంటే అది మమతా బెనర్జీనే. బీజేపీని, మోడీని గట్టిగా వ్యతిరేకించారు. ప్రధాని అభ్యర్థి రేసులోనూ నిలిచారు. కానీ గత ఎన్నికలతో పోలిస్తే తాజాగా సగం వరకు తగ్గాయి. బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి. ఇప్పుడు కాషాయ పార్టీ ఆమెకు ప్రమాదకరంగా మారింది. బీజేపీ నుంచి  ముప్పు పొంచి ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికలపై ఆమె దృష్టి పెట్టాల్సి ఉంది. అప్పుడు గెలవాలంటే ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందించుకోవాలి.

నితీశ్​కుమార్

బీహార్ సీఎం. గతంలో బీజేపీని విభేదించి, మళ్లీ ఆదే పార్టీతో చేతులు కలిపారు. తాజా ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారు. ఇప్పుడు ఎన్డీయే నీడలో ఎదగాలి. ఎన్డీయేకు సమాన భాగస్వామిగా కొనసాగాలి. 2020లో జరిగే ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచించాలి. మోడీ వేవ్​ను ఒడిసిపట్టుకుని విజయం సాధించాలి.