పెద్ద లీడర్లకూ.. ఓటమి తప్పలే..

పెద్ద లీడర్లకూ.. ఓటమి తప్పలే..

హైదరాబాద్‌ , వెలుగు :రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. కానీ కొందరు నేతలు వరుసగా గెలుస్తూ తమ హవా కొనసాగిస్తుంటా రు. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో తమ ప్రభావం చూపుతుంటారు. తమతోపాటు మరికొందరు నేతల జయాపజయాలు కూడా వారిపైనే ఆధారపడి ఉంటాయి. అలాంటి పెద్ద నేతలు కూడా ఒక్కోసారి ఎలక్షన్లలో దెబ్బతినక తప్పదు. ఢిల్లీ స్థాయిలో ఓ వెలుగు వెలిగిన నేతలకు సైతం ఒకానొక సమయంలో ఓటమి రుచి చూశారు. అందులో రాజకీయాల్లోకొచ్ చిన తొలినాళ్లలో ఓడిన వారు కొందరు ఉండగా.. రాజకీయాలను శాసించాక పరాజయం పాలైనవారు మరికొందరు ఉన్నారు. ఇలాంటి వారిలో చాలా మంది తిరిగి నిలబడగా.. కొందరు మాత్రం తమ చరిష్మాను కోల్పోయారు. రాష్ట్రానికి సంబంధించి అలాంటి పెద్ద నేతల్లో కొందరి వివరాలు..

పీవీ నరసింహారావు

తెలుగు రాజకీయాల్లో చక్రం తిప్పి, జాతీయ స్థా యికి ఎదిగిన నేత పీవీ నరసింహారావు. ప్రధాన మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకూ ఒక దశ లో ఓటమి తప్పలేదు. పీవీ 1977, 1980 ఎన్నికల్లో హన్మకొండ నుంచి  లోక్‌ సభకు పోటీచేసి విజయం సాధించారు.  కానీ 1984లో ఎలక్షన్లలో బీజేపీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి చేతిలో 54,198 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా రెండే సీట్లలో గెలవగా..అందులో ఒకటి హన్మకొండ కావడం గమనార్హం. ఆ తర్వాతి ఎన్నికల్లో తిరిగి గెలిచిన పీవీ ఏకంగా ప్రధాని పదవినీ చేపట్టారు.

జి.వెంకటస్వామి

కార్మికులకు అండగా నిలిచి, జాతీయ స్థాయిలో పేరు పొందిన నేత జి.వెంకటస్వామి.  వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ వచ్చి, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన ఆయన కూడా రెండు సార్లు ఓటమి పాలయ్యారు. 1998 ఎన్నికల్లో పెద్దపల్లి (ఎస్సీ) నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన వెంకటస్వామి.. టీడీపీ క్యాండిడేట్‌ సుగుణకుమారిపై 6,174 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. తర్వాత 1999 ఎన్నికల్లో దెబ్బతిన్నారు. కానీ 2004లో తిరిగి అదే లోక్​సభ స్థానంలో సుగుణకుమారిపై ఏకంగా 2,63,116 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

సూదిని జైపాల్‌ రెడ్డి

కాంగ్రెస్​ సీనియర్లలో ఒకరైన కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి కూడా ఎలక్షన్లలో ఓటమి రుచి చూశారు. మొదటి నుంచి కాంగ్రెస్​ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ తీరును నిరసిస్తూ జనతా పార్టీలో చేరారు. 1980 ఎలక్షన్లలో మెదక్‌ ఎంపీ స్థానంలో ఇందిరాగాంధీకి పోటీగా జనతాపార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి.. 2,19,124 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1984లో తొలిసారి ఎంపీగా గెలిచినా.. 1991లో మహబూబ్‌ నగర్‌ నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లికార్జున్‌ పై 69,778 ఓట్లతో ఓటమి చెందారు. తర్వాత రాజ్యసభ ఎంపీగా చేసినా ఆయన కాంగ్రెస్​ పార్టీలో కి తిరిగి వచ్చారు. 1999, 2004, 2009లో వరుసగా ఎంపీగా గెలిచారు.

బండారు దత్తా త్రేయ

కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తా త్రేయ కూడా ఐదు సార్లు ఓడిపోయారు. తొలి నుంచీ బీజేపీలోనే కొనసాగుతున్న ఆయన.. 1984లో టి. అంజయ్య చేతిలో, 1987లో టి.మణెమ్మ, 1996లో పీవీ రాజేశ్వర్​రావు, 2004, 2009 ఎన్నికల్లో ఎం.అంజ న్‌ కుమార్‌ యాదవ్‌ చేతిలో ఓడిపోయారు. ఇదే లష్కర్‌ నుంచి 1991, 1998, 1999, 2014 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు.1999లో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్​రావును ఓడించడం అప్పట్లో సంచలనంగా నిలిచింది.

నాదెండ్ల భాస్కర్‌ రావు

టీడీపీ వ్యవస్థా పక సభ్యుడైన నాదెండ్ల భాస్కర్​రావు మొదట్లో ఎమ్మెల్యే గా పనిచేశారు. 1998లో ఖమ్మం ఎంపీగా గెలిచారు. తర్వాత 1999లో లోక్​సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సికిం ద్రాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి.. బీజేపీ అభ్యర్థి బండారు దత్తా త్రేయపై 97,625 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

సీహెచ్ .విద్యాసాగర్‌ రావు

ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్​గా ఉన్న చెన్నమనేని విద్యాసాగర్‌ రావు కూడా లోక్​సభ ఎలక్షన్లలో దెబ్బతిన్నారు. 1980లో కరీంనగర్‌ ఎంపీ సీట్లో జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్‌ (ఐ) అభ్యర్థి ఎం. సత్యనారాయణరావు చేతిలో 1,14,048 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత మెట్​పల్లి నుంచి 1985 నుంచి వరుసగా ఎమ్మెల్యే గా గెలిచారు. 1998, 1999 ఎలక్షన్లలో కరీంనగర్​లో బీజేపీ ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2004లో టీఆర్​ఎస్​ అభ్యర్థి కేసీఆర్‌ చేతిలో 1,31,168 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇదే సీట్లో తర్వాత జరిగిన లోక్​సభ ఎలక్షన్లలో నూ వరుసగా ఓటమి చెందారు.