అకడమిక్ ఇయర్ మొదలై 4 నెలలైనా స్టూడెంట్లకు అందని యూనిఫామ్స్

అకడమిక్ ఇయర్ మొదలై 4 నెలలైనా స్టూడెంట్లకు అందని యూనిఫామ్స్
  • 24 లక్షల మంది ఎదురుచూపులు
  • ఇప్పటికీ క్లాత్ కోసం ఆర్డర్ ఇవ్వని సర్కార్ 
  • ఆ ఊసే ఎత్తని స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు 
  • యూనిఫామ్ కొనుక్కోవాలని హెడ్​మాస్టర్ల ఆదేశం

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడులను కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లకు దీటుగా తయారు చేస్తామని చెప్తున్న తెలంగాణ ప్రభుత్వం మాటలు, నీటి మూటల్లాగే కనిపిస్తున్నాయి. అకడమిక్ ఇయర్ మొదలై నాలుగు నెలలు గడిచినా .. బడి పిల్లలకు యూనిఫామ్స్ ఇవ్వలేదు. ఇప్పటివరకు కనీసం క్లాత్​కు కూడా సర్కారు ఆర్డర్ ఇవ్వలేదు. సర్కారు స్కూళ్లు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో చదివే స్టూడెంట్లకు ఏటా రెండు జతల స్కూల్​ డ్రెస్​లు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఈ ఏడాది వాటికి ఎగనామం పెట్టేలా కనిపిస్తోంది.

ఈ విద్యాసంవత్సరం జులై ఫస్ట్ నుంచి ప్రారంభం కాగా, సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఫిజికల్ క్లాసులు మొదలయ్యాయి. స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని స్కూళ్లలో 24 లక్షల మందిదాకా స్టూడెంట్లున్నారు. 8వ తరగతి వరకు స్టూడెంట్లకు ఒక్కో యూనిఫామ్​కోసం ప్రభుత్వం రూ.600 చొప్పున ఇస్తోంది. ఈ విద్యాసంవత్సరానికి 8వ తరగతి దాకా 20,19,219 మంది స్టూడెంట్లు ఉన్నారని, వాళ్ల యూనిఫామ్స్​కు రూ.121.15 కోట్లు అవసరమని రాష్ట్రం ఇదివరకే లెక్కలు వేసింది. ఈ మొత్తంలో 60% నిధులు కేంద్రమే ఇస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కోరగా, తన వాటా ఇచ్చేందుకు కూడా కేంద్రం ఓకే చెప్పింది. మిగిలిన క్లాసుల స్టూడెంట్లకు దాదాపు రూ.25 కోట్లు అవసరమవుతుందని అంచనా. ఈ మొత్తాన్ని కేటాయించాల్సిన రాష్ట్ర సర్కారు మాత్రం దాటవేత ధోరణిలో కనిపిస్తోంది. 

యూనిఫామ్ మాటే మరిచిన్రు
సర్కారు బడుల స్టూడెంట్లకు యూనిఫామ్స్ కోసం దాదాపు 1.30 కోట్ల మీటర్ల క్లాత్ అవసరం. ఈ క్లాత్​ కోసం రాష్ట్ర  హండ్లూమ్స్ అండ్ టెక్స్‌‌‌‌‌‌టైల్స్ డిపార్ట్​మెంట్​కు 4 నెలల ముందుగానే ఆర్డర్ ఇస్తారు. అయితే 2021–22 అకడమిక్ ఇయ ర్​కోసం అప్పటి విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చిత్రారాంచంద్రన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత, కరోనా ఎఫెక్ట్​తో రద్దు చేశారు. ప్రస్తుతం కరోనా తగ్గి, ఫిజికల్​గా స్కూళ్లు తెరిచినా క్లాత్​కు మళ్లీ ఆర్డర్ ఇవ్వలేదు. దీంతో ఈ ఏడాది ఇవ్వకూడదనే భావనలో సర్కారు ఉన్నట్టు అనుమానాలు వస్తున్నాయి. ఈ విషయంలో స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు కూడా అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

పేద స్టూడెంట్లపై భారం
ప్రభుత్వ స్కూళ్లలో చదివే స్టూడెంట్లంతా దాదాపు పేదింటి పిల్లలే. ప్రస్తుతం 8వ తరగతి వరకున్న 20.19 లక్షల స్టూడెంట్లలో 10.36 లక్షల మంది అమ్మాయిలు, ఎస్సీ బాయ్స్ 1.75లక్షల మంది,  ఎస్టీ బాయ్స్ 2.42 లక్షల మంది ఉన్నారు. బీపీఎల్ పరిధిలోని బాయ్స్ మరో 5.64 లక్షల మంది ఉన్నారు. చాలా స్కూళ్లలో హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాల్స్ బయట కొనుక్కోవాలని పేరెంట్స్​కు చెప్తున్నారు. అయితే యూనిఫామ్ ఇచ్చే అంశం ఇంకా చర్చలో ఉందని ఎస్ఎస్ఏ ఉన్నతాధికారి రెండు నెలల నుంచి చెప్తున్నారు. పెండింగ్ లో ఉన్న ఈ అంశంపై సర్కారు పెద్దలను అడిగేందుకు కూడా ఎస్ఎస్ఏ అధికారులు జంకుతున్నారని మరొక అధికారి అంటున్నారు. 

ఆర్డర్ ఇచ్చి క్యాన్సిల్ చేశారు
ఈ ఏడాది కోసం గతంలో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు క్లాత్​కు ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత సెక్రటరీ చిత్రరాంచంద్రన్ ఆర్డర్ క్యాన్సిల్ చేశారు. అప్పటికే 40% క్లాత్ రెడీ అయింది. ప్రస్తుతం అది మా దగ్గరే ఉంది. మళ్లీ ఎలాంటి ఆర్డర్ రాలేదు.
‑ శైలజా రామయ్యర్, హండ్లూమ్స్ అండ్ టెక్స్‌‌‌‌టైల్స్ కమిషనర్

బయట కొనుక్కున్నం
మా ఇద్దరు పిల్లలూ మోడల్ స్కూల్​లో చదువుతున్నారు. ఈ ఏడాది స్కూల్ యూనిఫామ్ రాకపోవడంతో బయట కొనుక్కోవాలని ప్రిన్సిపాల్ చెప్పారు. దీంతో ఇద్దరికి ఒక్కో డ్రెస్ తీసుకుంటే రూ.1200 చొప్పున ఖర్చయింది. ప్రభుత్వం ఇప్పటికే ఇస్తే, ఈ ఖర్చు తప్పేది. 
‑ ఓ పేరెంట్, సదాశివనగర్ మోడల్ స్కూల్, కామారెడ్డి జిల్లా