
ఆత్మకూరు, వెలుగు: లిఫ్ట్ ఇస్తానని నమ్మించి, మహిళను కొట్టి నగదు దోపిడీ చేసిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ వద్ద జరిగింది. ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి వివరాల ప్రకారం.. రేగొండ మండలానికి చెందిన మహిళ మంగళవారం ఉదయం 11గంటలకు పరకాల వెళ్లేందుకు గూడెప్పాడ్ వద్ద బస్ కోసం వెయిట్ చేస్తోంది. గీసుకొండ మండలం ఏలుకుర్తి గ్రామానికి చెందిన రాకేశ్ లిఫ్ట్ ఇస్తానని చెప్పి తన టవేరా వెహికల్లో ఎక్కించుకున్నాడు. పరకాల మండలం కామారెడ్డి పల్లె గ్రామ శివారులో వెహికల్ ఆపి, మహిళను ఇనుపరాడ్డుతో కొట్టాడు. మెడలోని పుస్తెల తాడు, కమ్మలు, కాళ్ల పట్టీలు లాక్కున్నాడు. తీవ్ర గాయాలైన మహిళను హన్మకొండలోని పెద్దమ్మగడ్డ ఎస్సారెస్పీ కెనాల్లో పడేసి, పారిపోయాడు. ఆమె అరుపులు విని చుట్టుపక్కల వాళ్లు 108లో వరంగల్ఎంజీఎంకు తరలించారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం నేషనల్ హైవేపై ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేసి, వెహికల్ నంబర్ ఆధారంగా నిందితున్ని పట్టుకున్నారు. దొంగిలించిన సొత్తును బాధితులకు అప్పగించారు.