ధనుర్మాసం .. శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టం.. బ్రహ్మదేవుడు.. నారదుడికి చెప్పిన రహస్యం ఇదే..!

ధనుర్మాసం .. శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టం..  బ్రహ్మదేవుడు.. నారదుడికి చెప్పిన రహస్యం ఇదే..!

ధనుర్మాసం గురించి మొదట బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి వివరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ధనుర్మాస వ్రత ప్రస్తావన, మహాత్మ్యాలు బ్రహ్మాండ, భాగవత ఆదిత్యపురాణాల్లో, నారాయణ సంహితలో కనిపిస్తుంది.వేద పంచాంగం ప్రకారం  మార్గశీర్ష మానం ఆరంభమైన ఏడు రోజులకు ధనుస్సంక్రమణం జరుగుతుంది. అప్పటి నుంచి  పుష్యమాసం ప్రారంభమైన ఆరవ రోజు వరకు ఉంటుంది.  ఈ ఏడాది ధనుర్మాసం  2025 డిసెంబర్​ 16 నుంచి 2026 జనవరి 14 వరకు ఉంటుంది. 

ధనుర్మాసంలో చేసే వ్రతం కనుక దీనిని ధనుర్మసవత్రం అంటారు. జ్యోతిష్యం ప్రకారం  మేషం నుండి మీనం వరకు పన్నెండు రాశులున్నాయి.సూర్యుడు మేష రాశిలో ప్రవేశిస్తే ధనుస్సంక్రమణం లేదా మేష సంక్రాంతి అవుతుంది.  సూర్యుడు ధనూరాశిలో ప్రవేశిస్తే ధనుస్సంక్రమణం లేక ధనుస్సంక్రాంతి అవుతుంది. ధనస్సు రాశిలో  సూర్యుడు సంచరించే మాసాన్ని ధనుర్మాసం అంటారు.

'మాసోహం మార్గశీర్షోహం

 శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా... మాసోహం మార్గశీర్షోహం.... అని తననే  మార్గశీర్ష మాసం అని పిలుస్తారని  భగవద్గీతలో సెలవిచ్చాడు. అందుకే ఇది శ్రీకృష్ణ భగవాసునికి ఎంతో ఇష్టమైన నెల.  విష్ణుస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్ముడిని  ఈ మాసంలో విశేషంగా ఆరాధిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని శ్రీ గోదాదేవి మనకు నిరూపించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. 

పండితులు తెలిపిన వివరాల ప్రకారం  ఉత్తరాయణం, దక్షిణాయనం అని రెండు పుణ్యకాలాలున్నాయి.  ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగలు..  దక్షిణాయన పుణ్యకాలం వారికి రాత్రిగాను ఉంటుంది. అంటే మనకు ఒక సంవత్సర కాలం.. దేవతలకు ఒకరోజన్నమాట.. అందుకే పితృ దేవతలకు ఏడాదికొకసారి తర్పణాలు వదిలే సంప్రదాయం ఆచరణలో ఉన్న విషయం మీకు తెలిసిందే..

 మార్గశీర్ష మాసం ఉత్తరాయణ పుణ్యకాలానికి తెల్లవారు జాము సమయం.. అంటే  దేవతలకు  బ్రహ్మీ ముహూర్తం .  దేవతలు కూడా ఆ సమయంలో ధ్యానంలో ఉంటారు . అందుకే  మార్గశీర్షమాసం ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.  ఇక ధనుర్మాస వ్రత విషయానికొస్తే  ద్వాపరయుగంలో శ్రీ కృష్ఠుడిని  పొందగోరిన గోపకన్యలు  కాత్యాయినీ వ్రతాన్ని చేశారు, అందులో  ఒక గోపకన్య అయిన గోదాదేవి  తానున్న విల్లిపుత్తూరును వ్రేపల్లెగను...  తన స్నేహితురాళ్ళను వ్రజ కన్యలుగను భావించి...  తాను గొల్ల కన్య రూపాన్ని ధరించి విల్లిపుత్తూరులో వేంచేసియున్న వటపత్రశాయినే శ్రీకృష్ణునిగా భావించింది గోదాదేవి. మార్గశీర్షమాసాన ధనుర్మాస సమయంలో శ్రీ స్వామివారిని నెలరోజులూ అర్చిస్తూ రోజుకొక పాశురాన్ని(పాట) గోదాదేవి  సమర్పించింది. 

శ్రీ గోదాదేవి స్వామికి సమర్పించిన పాశురాలు ప్రణవమంత్ర, అష్టాక్షరీ మంత్ర, స్వరూపాలే. వేదోపనిషత్తుల సారాంశమే..  నియమ నిష్ఠలతో స్వామిని ఆరాధిస్తే ముప్పది దినాల్లోనే తరుణోపాయం లభిస్తుందని చాటి చెప్పింది మన ఆండాళ్ తల్లి చూపిన మార్గంలో పయనించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం.

వ్రతం చేయదల్చుకున్న వారెవరైనా నిష్ఠను కలిగి కులమత వర్గ భేదాల కతీతంగా ఉండి బ్రాహ్మీ ముహూర్తంలో బహిర్ స్నానం చేయాలి. ( బావి దగ్గర, కుళాయి దగ్గర, నదీతీరంలో) అలా అవకాశం లేనివారు ఇంట్లోనే బకెట్​ లో నీరు పట్టుకొని దానిలోని జీవనదులను ఆవాహన చేసి ముఖానికి పసుపు రాసుకొని చేయాలి.  అంతర్ మనస్సుకు భక్తిజల స్నానాన్ని అవలంభించటం ముద్గాన్నం ( పులగం)  వండి ఆరగింపు చేయాలి. 

ఈ మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన  పాశురాలను అంటే ...తిరుప్పావై పఠిస్తారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ఈ నెలరోజులు పాశురాలతో మేల్కొలుపుతారు. మధుసూధనస్వామివారిని పూజించడంతో పాటూ బృందావనంలో తులసిని పూజించాలి. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలి.

ఇంటిముందు శుభ్రపరిచి పేడనీటితో కళ్ళాపి చల్లి, బియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది, ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బిళ్ళను ఉంచి, వాటిని గుమ్మడి, బీర, చామంతి, బంటి వంటి పూలతో అలంకరించి నమస్కరించాలి. అనంతరం కాత్యాయనీదేవిని షోడశోపచారాలు , అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా ప్రతిరోజూ ధనుర్మాసమంతా ఆచరించాలి.

 తెలుగునాట గొబ్బెమ్మల వ్రతంగా పేరు పడిన ఈ కాత్యాయనీ వ్రతాన్ని కన్యలు ఆచరించడం వల్ల మంచి భర్త లభిస్తాడని పండితులు చెబుతున్నారు. వ్రతం ప్రాతఃకాలములో ప్రారంభం అయితే రోజూలాగ కాక సూర్యోదయానికి ముందే పూజ అయ్యేటట్టు చూసుకోవాలి. నైవేద్యం సమర్పించాలి(రోజు పొంగలి,తద్ధోజనం,పరవన్నం ఉండి తీరాలి....సమయం ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు... మనము కూడా హిందూ సంప్రదాయాల ప్రకారం ఈ వ్రతాన్ని ఆచరిద్దాం..  శ్రీ గోదా రంగనాధుల అనుగ్రహాన్ని పొందుదాం..

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.