Sri Rama Navami : రాత్రి వేళ రాములోరి  కల్యాణం

Sri Rama Navami : రాత్రి వేళ రాములోరి  కల్యాణం

శ్రీరామనవమి రోజు అభిజిత్ ముహూర్తాన మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల కల్యాణం జరుగుతుంది ఎక్కడైనా. కానీ.. ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా రాత్రి వేళ కల్యాణం చేస్తారు. అలా చేయడం వల్లే వందల ఏండ్ల నుంచి ఈ ప్రాంతంలో ఒక్కసారి కూడా వడగండ్లవాన పడలేదని చెప్తున్నారు ఇక్కడివాళ్లు. అంతేకాదు.. ఇరవై ఏండ్ల క్రితం ఒకసారి మధ్యాహ్నం టైంలో స్వామి కల్యాణం చేస్తే.. అదే రోజు ఊళ్లో విపరీతమైన వడగండ్ల వాన కురిసిందట!

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం రామచంద్రాపూర్‌‌‌‌‌‌‌‌లో మోయ తుమ్మెద వాగు ఒడ్డున ఉన్న గుట్ట మీద దాదాపు 400 ఏండ్ల నాటి సీతారామచంద్ర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామి స్వయంభుగా వెలిశాడని చెప్తుంటారు. అన్ని ఆలయాల్లో సీతారాముల కల్యాణం మధ్యాహ్నం జరిగితే ఈ ఆలయంలో మాత్రం రాత్రి వేళ చేస్తారు. అలా రాత్రిపూట కల్యాణం చేయడం వల్లే ఆ ఊళ్లో వడగండ్ల వర్షం పడడం లేదని నమ్ముతారు గ్రామస్తులు. కోహెడ మండల పరిధిలో కొన్ని దశాబ్దాల నుంచి ప్రతి ఏటా వడగండ్ల వర్షం పడుతోంది.

కానీ.. అదే మండలంలో ఉన్న రామచంద్రాపూర్‌‌‌‌‌‌‌‌లో మాత్రం వడగండ్లు కురవడం లేదు. రాత్రివేళ కల్యాణం చేయడం వల్లనే అనే గ్రామస్తుల అభిప్రాయానికి ఇది మరింత బలాన్ని ఇచ్చింది. అయితే.. రెండు దశాబ్దాల  క్రితం ఒకసారి మధ్యాహ్నం వేళ సీతారాముల కల్యాణం చేశారు. అదే రోజు భారీ వడగండ్లు కురిసిందట! దాంతో గ్రామంలోని రైతులంతా తమ పంటలు నష్టపోయారు. అందుకే మళ్లీ అలాంటి సాహసం ఇప్పటివరకూ చేయలేదు.

రాత్రివేళ కల్యాణం చేసే సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నారు. సాయంత్రం ఆరు గంటలకు కల్యాణ వేడుకలు మొదలై.. రాత్రి 9 గంటలకు ముగుస్తాయి. కల్యాణోత్సవాన్ని చూసేందుకు సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు హైదరాబాద్  నుంచి వేలాదిగా భక్తులు వస్తుంటారు. ఇక్కడ వారం రోజుల పాటు జాతర జరుగుతుంది. 

ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌17న సీతారాముల కల్యాణ,18న హోమం బలిహరణం,19న ఎడ్ల బండ్లు తిరగటం, 20న రాత్రి జాతర, పూజా కార్యక్రమాలు, 21న  సీతారాముల రథోత్సవ కార్యక్రమం చేస్తారు. 

 సిద్దిపేట, వెలుగు