
కలియుగవైకుంఠం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం ( సెప్టెంబర్ 30 ) రాత్రి చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు మలయప్ప స్వామి. తిరువీధులలో పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు గోవింద నామాలు జపిస్తూ వాహనసేవను తిలకించారు.
చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది.భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.
ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం 8 గంటలకు స్వామివారు బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.