రోడ్లపైనే 3.5 లక్షల ట్రక్కులు

రోడ్లపైనే 3.5 లక్షల ట్రక్కులు
  • వాటిలో రూ.35 వేల కోట్ల విలువైన వస్తువులు
  • లాక్​డౌన్​లో చిక్కుకుపోయాయన్న ట్రాన్స్‌ పోర్టర్లు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా సుమారు మూడున్నర లక్షల టక్కులు రోడ్లపైనే నిలిచిపోయాయని, వాటిలో రూ.35 వేల కోట్ల విలువైన గూడ్స్‌ ఉందని ట్రాన్స్‌ పోర్టర్లు వెల్లడించారు. వీటిలో ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు, ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఇండస్ట్రియల్ రామెటీరియల్స్ కెమికల్స్, స్టీల్, సిమెంట్ వంటివి ఉన్నట్టు తెలిపారు. లాక్‌డౌన్ వల్ల సరైన ఆహారం, శానిటేషన్ సౌకర్యాలు, తిండి లేక చాలా మంది డ్రైవర్లు, హెల్పర్లు ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల వస్తువులను తరలించేందుకు ఆసక్తి చూపలేదని ట్రాన్స్ పోర్టర్లు తెలిపారు. దీంతో గూడ్స్ డ్యామేజ్ రిస్క్ పెరిగిందన్నారు. డీలర్‌‌షిప్‌లు, గోడౌన్స్ లేదా నిర్దేశిత ప్రాంతానికి చేరుకున్నాక కూడా స్టాక్స్ ను అన్‌లోడ్ చేసేందుకు తగిన మ్యాన్​ పవర్​ దొరకడం లేదన్నారు. ట్రాన్స్‌ పోర్టర్లు చాలా బాధకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు ఆల్‌ ఇండియా మోటార్ ట్రాన్స్‌ పోర్ట్ కార్పొరేషన్(ఏఐఎంటీసీ) ప్రెసిడెంట్ కుల్తరన్ సింగ్ అత్వాల్ చెప్పారు. తమ అసోసియేషన్‌లోని ట్రక్కుల్లో ప్రజలకు అవసరమైన ఫుడ్, మెడిసిన్లు, శానిటేషన్ ప్రొడక్ట్‌ల తరలింపుకు వాడుతున్నట్టు అత్వాల్ తెలిపారు. అయితే ట్రక్కుల ద్వారా సరుకుల రవాణాకు ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు.