అమ్మో ఆ రోడ్డా..! చినుకు పడితే చిత్తడే.. ములుగు-భద్రాచలం రోడ్డుపై వాహనదారుల కష్టాలు

అమ్మో ఆ రోడ్డా..! చినుకు పడితే చిత్తడే.. ములుగు-భద్రాచలం రోడ్డుపై వాహనదారుల కష్టాలు

ములుగు, వెంకటాపురం(నూగూరు), వెలుగు : ములుగు జిల్లాలోని వెంకటాపురం - భద్రాచలం ప్రధాన రహదారిపై ప్రయాణించాలంటేనే వణుకుపుడుతోంది. యాకన్నగూడెం వరకు సుమారు 30 కిలోమీటర్ల వరకు చినుకు పడితే చాలు వాహనాలు నిలిచిపోవాల్సిందే. గత ప్రభుత్వ హయాంలో గోదావరి వెంట ఇష్టారీతిన ఇసుక రీచ్​లకు అనుమతులు ఇవ్వడంతో ఇష్టారీతిన లారీల రాకపోకలతో రోడ్లు అధ్వానంగా మారాయి. యాకన్న గూడెం శివార్లలోని రాళ్లవాగు వంతెన జనవరిలోనే కుంగిపోగా పునర్నిర్మించారు. వెంకటాపురం మండలం ఎదిర, సూరవేడు, అలుబాక, రామచంద్రాపురం, వీరభద్రవరం, వెంకటాపురం గ్రామాల్లో రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో రెండు నెలలు ఆర్టీసీ వాహనాలు నడువలేదు. 

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అధికారులతో మాట్లాడి గుంతల్లో గ్రావెల్ పోయించి తాత్కాళిక రవాణాకు ఏర్పాట్లు చేశారు. ఇటీవల బోదాపురానికి చెందిన ఓ వ్యక్తికి పాము కాటు గురికాగా, 108లో తరలించే ప్రయత్నం చేయగా, వాహనాలు దిగబడటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై తిరుపతి చొరవతో గ్రామస్తులు బైక్ ఏర్పాటు చేసుకొని బాధితుడిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడగలిగారు. రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఏజెన్సీ గ్రామాల ప్రజలు కోరుతున్నారు. కాగా, రోడ్డు మరమ్మతుల కోసం సెప్టెంబర్​ 7నుంచి వెంకటాపురం మండల అఖిలపక్ష నాయకులు పాదయాత్ర చేసేందుకు సన్నద్ధం అవుతున్నట్లు ప్రకటించారు.