కొనుగోలు సెంటర్లు లేకపోతే క్వింటాల్ కు రూ.200 లాస్

కొనుగోలు సెంటర్లు లేకపోతే క్వింటాల్ కు రూ.200 లాస్

హైదరాబాద్, వెలుగురాష్ట్ర ప్రభుత్వం సివిల్​సప్లయ్స్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్ల ద్వారా వడ్లను కొనుగోలు చేయకపోతే రైతులకు పెద్ద ఎత్తున నష్టం వస్తుందని ప్రొఫెసర్​జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆందోళన వ్యక్తం చేసింది. మిల్లర్లు, ట్రేడర్లు మద్దతు ధర ఇయ్యరని, రైతులకు క్వింటాల్ వడ్లకు రూ.200 వరకు నష్టం వస్తుందని తెలిపింది. ఈ మేరకు వర్సిటీకి చెందిన మార్కెటింగ్ ఇంటలిజెన్స్ వింగ్ రాష్ట్ర సర్కార్ కు రిపోర్టు అందజేసింది. దేశవ్యాప్తంగా వరి సాగు, ఉత్పత్తి, మార్కెట్ ధర, ఎక్స్ ఫోర్ట్స్ తదితర వివరాలను పొందుపరిచింది. వడ్లకు మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరుకుంటున్నారని.. కానీ మిల్లర్లు, ట్రేడర్లు మాత్రం మద్దతు ధర ఇచ్చే ఆలోచనలో లేరని పేర్కొంది. సాధారణ రకం వడ్లకు కేంద్ర ప్రభుత్వం రూ.1,868 మద్దతు ధర ప్రకటించిందని, కానీ వ్యాపారులు రూ.1,600 నుంచి రూ.1,750 వరకే ఇచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అంటే రైతులు ఒక క్వింటాల్ కు రూ.118 నుంచి రూ.268 వరకు నష్టపోతారని రిపోర్టులో తెలియజేసింది. మార్కెట్​మోడల్​ధర కూడా క్వింటాల్ కు రూ.1680కి మించదని చెప్పింది. ఫిబ్రవరి చివరి వారంలో సూర్యాపేట మార్కెట్​కు వచ్చిన సాధారణ రకం వడ్లకు క్వింటాల్ కు కనీస ధర రూ.1,600 లోపు ఉండగా.. గరిష్టంగా రూ.1,717 మాత్రమే వచ్చిందని గుర్తు చేసింది. ఇక వడ్లను వ్యాపారులు కొనుగోలు చేస్తే ట్రాన్స్ పోర్టు, హమాలీల చార్జీలు కూడా రైతులపైనే వేస్తారని.. దీంతో రైతులకు మిగిలేదేమీ ఉండదని వర్సిటీ రిపోర్టులో పేర్కొంది. ఈ సీజన్ లో రాష్ర్ట వ్యాప్తంగా 51.62 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. కోటి మెట్రిక్ టన్నులపైనే వడ్ల దిగుబడి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల ముందుగా వేసిన వరి.. పొట్ట దశకు వచ్చింది. ఈ నెలాఖారు కల్లా వరి కోతలు మొదలుకానున్నాయి.  

మక్క రైతులకు మరింత నష్టం..

మక్కలకు కూడా మద్దతు ధర వచ్చే పరిస్థితి లేదని యూనివర్సిటీ రిపోర్టులో వెల్లడైంది. ఈ సీజన్ లో దాదాపు 4.5 లక్షల ఎకరాల్లో మక్కలు వేశారు. 11.24 లక్షల మెట్రిక్​టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మక్కలకు మద్దతు ధర క్వింటాల్ కు రూ.1,850 ఉంది. కానీ మార్కెట్​లో మాత్రం రూ.1,350 నుంచి రూ.1,500 వరకు మాత్రమే వస్తుందని ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో జయశంకర్ వర్సిటీ పేర్కొంది.

వరి సాగులో దేశంలోనే ఫస్ట్..

ప్రపంచవ్యాప్తంగా వరి సాగు చేస్తున్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా, మన దేశం రెండో స్థానంలో ఉంది. 2019–20లో మన దేశంలో 118.43 లక్షల మెట్రిక్​ టన్నుల బియ్యం ఉత్పత్తి అయితే, ఈ సారి అది 121 లక్షల మెట్రిక్​ టన్నులు దాటుతుందని రిపోర్టులో వెల్లడైంది. చైనాలోనూ దాదాపు 2శాతం ఉత్పత్తి పెరుగుతుందని, ఇది ఎక్స్ పోర్ట్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని వర్సిటీ పేర్కొంది. ఇక దేశంలో వరి సాగులో మన రాష్ట్రమే మొదటి స్థానంలో ఉందని, ఆ తర్వాత స్థానంలో తమిళనాడు ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ​ఇండియా(ఎఫ్ సీఐ) బియ్యం సేకరణపై రాష్ట్రాలకు స్పష్టతనిచ్చింది. మన రాష్ట్రంలో 70 లక్షల మెట్రిక్​ టన్నుల నుంచి 74 లక్షల టన్నుల వరకు సేకరించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే ప్రభుత్వం మాత్రం వడ్లను కొనుగోలు చేయబోమని ప్రకటించడంతో సివిల్​ సప్లయ్స్ ​డిపార్ట్ మెంట్ అయోమయంలో పడింది. సడెన్ గా  కొనుగోలు చెయ్యాలని చెప్తే.. గన్నీ బ్యాగులు, కొనుగోలు కేంద్రాలు, స్టోరేజ్​వంటి సమస్యలు తప్పవని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.