ఏమాటకామాటే.. పాతఫోన్లే గట్టిగుంటయ్

ఏమాటకామాటే.. పాతఫోన్లే గట్టిగుంటయ్

ఈ జనరేషన్​లో మనిషి కనీస​ అవసరాల్లోకి ఫోన్​ చేరిపోయింది. మన శరీరంలో ఒక భాగం అయింది. స్మార్ట్​ఫోన్​ లేని ఇంటిని వెతకాలి అనుకోవడం అత్యాశే అవుతుంది. క్యాలెండర్​ మారుతుంటే, ఫోన్​లూ మారిపోతున్నాయి. నెలల గ్యాప్​తోనే అప్​డేట్ అయిపోతున్నాయి. ఎవరికి వాళ్ళు తమకి నచ్చిన అప్​డేట్ వెర్షన్​కు మారిపోతున్నారు. ఈ రోజు ఫ్రెండ్ చేతిలో కనిపించిన కొత్త ఫోన్… మళ్ళీ కలిసేలోగా మారిపోదని​ గ్యారెంటీ ఇవ్వలేం. అప్​డేట్​ అవ్వాల్సిన ఈ కాలంలో ఫోన్​ మార్చడం తప్పడం లేదంటున్నారు. ఎవరినికదిపినా… పాత ఫోన్ల మీదే తమకు ప్రేమ అనీ, అదో నోస్టాల్జియా అనీ, కొత్త ఫోన్లు అవసరం మాత్రమే అనీ అంటున్నారు.

పాతవి ఎప్పటికీ ఒక జ్ఞాపకంగా మిగిలిపోయే ఉంటాయి. టైం, ట్రెండ్​ వాటిని మన నుంచి దూరం చేయగలవు. కానీ మన ఆలోచనల నుంచి దూరం చేయలేవు. ఇప్పుడున్న స్మార్ట్​ఫోన్స్​ రోజుకోరకంగా మారిపోతున్నాయి. అందరినీ ఎట్రాక్ట్​ చేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే గాడ్జెట్స్ తమ చుట్టూరా మనుషులని తిప్పుకుంటున్నాయి. ఇంత టెక్నాలజీ మాయలోనూ ఎంతోమంది ఇప్పటికీ పాత బేసిక్​ ఫోన్​లను ఇష్టపడుతున్నారు.

అదో నోస్టాల్జియా… 

బేసిక్​ ఫోన్​, మొద్దుసెట్​ ఫోన్​, సన్నపిన్ను ఛార్జర్​, లావుపిన్ను ఛార్జర్​… ఈ కాలంలో ఇలాంటి మాటలు వినపడే అవకాశమే లేదు. కానీ ఇప్పుడు మూడుపదుల వయసు దగ్గరిగా ఉన్నవాళ్లకూ, ఆపైన వయసు వాళ్లకూ ఆ మాటలు బలమైన నోస్టాల్జియా. వాళ్లను స్కూల్ వయసుకూ, కాలేజ్ వయసుకూ, ఒక పదేళ్ల వెనక్కీ తీసుకెళ్లే టైం మెషిన్​. ఇప్పటికీ ఎంతో మంది, వాళ్లు వాడిన మొదటి ఫోన్​ గురించి మురిపెంగా చెప్పుకుంటారు. అది కొనిచ్చిన వ్యక్తులను గుర్తుచేసుకుని హాపీగా ఫీల్ అవుతారు. ఉన్న కొద్ది ఎస్సెమ్మెస్​లనూ జాగ్రత్తగా వాడుకున్న పొదుపుతనాన్ని గుర్తుచేసుకుని నవ్వుకుంటారు.

పాతవే గట్టివి…

అత్యంత అవసరమైన వస్తువుల జాబితాలో స్మార్ట్​ఫోన్​ చేరిపోయినట్టే, అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన వస్తువుల జాబితాలోనూ స్మార్ట్​ఫోన్​ చేరిపోయింది. పొరపాటున చేయిజారి కింద పడిందా ఇక అంతే సంగతులు. స్క్రీన్​ ఏమాత్రం డ్యామేజ్​ అయినా, ఫోన్​ కాస్ట్​లో సగం బిల్ అవుతుంది.  ఎంత కాస్ట్​లీ ఆండ్రాయిడ్​ ఫోన్ తీసుకున్నా, ఏడాది తర్వాత హ్యాంగ్​ అవడం స్టార్ట్​ అవుతుంది. ఇక ఎప్పుడైనా పొరపాటున నీళ్లల్లో పడిందా? ఆ ఫోన్​ని దాదాపు మర్చిపోవాల్సిందే. కష్టపడి రిపేర్​ చేయించుకున్నా, దాని పెర్ఫామెన్స్​ అంతంతమాత్రంగానే ఉంటుంది. ఇలాంటి విషయాలలో పాత ఫోన్​లే మహాగట్టివి.  గట్టిగా గోడకేసి కొట్టినా, ఆ తర్వాత తీరిగ్గా అన్ని పార్ట్​లనూ సెట్​ చేసుకోవచ్చు. నీళ్ళలో పడిపోయినా, బయటికి తీసి… ఎంచక్కా ఎండలో ఆరబెట్టుకుని వాడుకోవచ్చు.


పాత బేసిక్​ మొబైళ్లు ఎంత గట్టివైనా సరే, ఈ కాలానికి మాత్రం పెద్దగా ఉపయోగపడవు. ఇప్పుడున్న అవసరాలకు కచ్చితంగా ట్రెండీ స్మార్ట్​ఫోన్​ను తీసుకోవాల్సిందే. అయితే ఇప్పటికీ ఆ ఫోన్​లను మర్చిపోలేని వాళ్లు బోలెడుమంది ఉన్నారు. ఒకవైపు స్మార్ట్​ఫోన్​ను వాడుతూనే మరోవైపు దాన్నీ ఉపయోగిస్తున్నారు. ఇంకొందరైతే అప్పుడు వాడిన ఫోన్​లను ఇప్పటికీ భద్రంగా దాచుకుంటున్నారు.

లారీ ఎక్కినా అట్లనే ఉంది…

నేను బీటెక్​లో ఉన్నప్పుడు మా నానమ్మ నాకు ఒక మోటొరోలా ఫోన్​ కొనిచ్చింది. ఇప్పుడు ఆమె లేదు. కానీ నానమ్మ గుర్తుగా ఇప్పటికీ ఆ ఫోన్​ని దాచుకున్నాను. మా ఫ్రెండ్స్​ అందరిలోకీ ముందు ఫోన్​ వాడింది నేనే. అదే కాకుండా నా మొబైల్​కు చాలా ప్రత్యేకత ఉండేది. ఒకరకంగా చెప్పాలంటే అది కాలేజ్​లో నాకు చాలా క్రేజ్​ను తెచ్చిపెట్టింది. ఒకసారి క్లాస్​మెట్స్​ అంతా పిక్నిక్​కి వెళ్లాం. అక్కడ ఒక చిన్న లేక్​లో నా ఫోన్​ పడిపోయింది. దాన్ని వెతికి బయటికి తీయడానికి గంటసేపు పట్టింది. ఇక దాని పని అయిపోయినట్టేనని అందరూ అనుకున్నారు. నాకూ ఏం చేయాలో తోచలేదు. కాసేపు ఎండలో ఉంచాను. ఒక అరగంట తర్వాత కాల్​ వచ్చింది. గమ్మత్తుగా అది ఎప్పటిలానే పనిచేస్తూ ఉంది. మరోసారి నా ఫోన్​ మీద నుంచి లారీ వెళ్లినా అట్లనే ఉంది. ఇలాంటి సంఘటనలు బోలెడున్నాయి. చెప్తే నమ్ముతారో లేదో కానీ నా ఫోన్​తో నేను కుంకుడుకాయలని కూడా కొట్టుకునే వాడిని. ఇప్పుడున్న అవసరాల వల్ల స్మార్ట్​ఫోన్​కు మారిపోయాను. ఇప్పుడు ఎన్ని ఫీచర్స్​ ఉన్న కొత్త ఫోన్​లు వచ్చినా, నాకు నా పాతఫోన్​ అంటేనే ప్రేమ. ఇప్పుడు వాడుతున్న ఫోన్​ అవసరం. – రామాంజనేయిలు వడ్లమూడి

ఇవేవీ లేకపోతే…

నేను ఒక కార్పొరేట్​ కంపెనీలో హెచ్ఆర్​గా పనిచేస్తున్నాను. హైదరాబాద్​లోనే ఉంటాను. డిగ్రీ ఫస్ట్​ ఇయర్​లో ఉన్నప్పుడు మా అమ్మ ఫోన్​ కొనిచ్చింది. అందులో గేమ్స్​ ఆడుతుంటే చాలా ఫన్​ ఉండేది. వాడటానికి కూడా చాలా సౌకర్యంగా ఉండేది. పొరపాటున కిందపడ్డా ఏ ఇబ్బందీ ఉండేది కాదు. ఇప్పుడు వాడుతున్న స్మార్ట్​ఫోన్​ అలా కాదు. దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ రోజుల్లో ఈ బాధ ఉండేది కాదు. అంతే కాకుండా నా మొదటిఫోన్​తో నాకు చాలా జ్ఞాపకాలున్నాయి. ఇప్పటికీ అది గుర్తొస్తూనే ఉంటుంది. కానీ నా జాబ్​లో ఉన్న అవసరాల వల్ల తప్పనిసరిగా స్మార్ట్​ఫోన్ అవసరమైంది. ఈ మధ్యకాలంలో ఫొటోగ్రఫీపైనా ఆసక్తి పెరిగింది. దాంతో మంచి కెమెరా ఉన్న ఫోన్​ అవసరముంది. ఇవేవీ లేకపోయి ఉంటే నా పాత ఫోన్​నే వాడటానికి ఇప్పటికీ ఇష్టపడతాను.  – రమ్య శ్రీ

అదే నాకొచ్చిన బెస్ట్​ గిఫ్ట్​

నేను ఇంటర్​ సెకండ్​ ఇయర్​లో ఉన్నప్పుడు మా నాన్న ఫోన్​ కొనిచ్చాడు. ఇప్పటికీ నాన్న ఇచ్చిన బెస్ట్​ గిఫ్ట్​ ఏదంటే, అదే చెప్తాను. దాంతో నాకు బోలెడన్ని మెమరీస్​ ఉన్నాయి. ఎన్నిసార్లు కోపంతో కింద విసిరినా, ఎప్పట్లానే పనిచేసేది. అందులో స్నేక్​ గేమ్​ ఆడటం నాకు భలే సరదాగా అనిపించేది. నేను నా ఫోన్​లో మొదటి కాల్​ను హాస్టల్​లో ఉన్న మా అక్కతో మాట్లాడాను. ఆ సీన్ ఇప్పటికీ నా కళ్ల ముందు కదులుతూనే ఉంటుంది. దాంతో చాట్ చేయడంలో చాలా కిక్​ ఉండేది. ఇప్పుడు ఎన్ని అడ్వాన్స్​ ఫీచర్స్​ ఉన్న ఫోన్​లు వచ్చినా, బోలెడన్ని యాప్​లు వచ్చినా ఆ ఫీలింగ్ కలగడం లేదు. నేను ఇంటర్​ సెకండర్ ఇయర్​లో టౌన్​ ఫస్ట్​ వచ్చాను. దానికి నా ఫోన్​ కూడా సాయపడింది. పొద్దున్నే 5 గంటలకు అలారం కొట్టిమరీ నిద్రలేపేది. ఆ ఫోన్​ తర్వాత చాలా అడ్వాన్స్​డ్​ ఫోన్​లను వాడాను. కానీ నాకు అదంటేనే బాగా ఇష్టం. అయితే ఇష్టం మాత్రమే సరిపోదు. ఇప్పటికీ అదే ఫోన్​ని వాడాలంటే, బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధాలు ఉండకుండా ఉండేందుకు సిద్ధపడాలి. – అజయ్​ కుమార్​ యిన్నమూరి