మేడారం వనమంతా జనమే

మేడారం వనమంతా జనమే
  • శిగాలూగుతున్న భక్తులు
  • మేడారం వనమంతా జనమే
  • సమ్మక్క గద్దెపైకి వెదురు కర్రలు తెచ్చిన వడ్డెలు
  • నిండు బిందెలు, మంగళహారతులతో స్వాగతం
  • సాయంత్రం గద్దెపైకి సమ్మక్క
  • భారీగా తరలివస్తున్న భక్తులు
  • అడుగడుగునా ట్రాఫిక్ జాం
  • జంపన్న వాగులో ఫుల్ పబ్లిక్

వనమంతా జనమే.. ఇవాళ రాత్రి సమ్మకు గద్దెకు చేరనుండటంతో లక్షల సంఖ్యలో భక్తులు మేడారం చేరుకుంటున్నారు. చిలుకల గుట్టపై కుంకుమ భరిణె రూపంలో కొలువై ఉన్న సమ్మక్కను వడ్డెలు(పూజారులు) తీసుకు వచ్చి ప్రతిష్ఠిస్తారు. సమ్మక్క రాకకు గుర్తుగా ఎస్పీ ఏకే 47తో మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరుపుతారు. ఇవాళ ఉదయం సమ్మక్క రాకకు ముందు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం అటవి నుంచి వనం (వెదురు కర్రలను) గద్దెకు తీసుకువచ్చారు. జాతరకు వచ్చిన భక్తులు వనాన్ని తాకి సమ్మక్కకు మొక్కుకున్నారు. గ్రామస్థులు నీరాజనాలు పలికారు. నిండు బిందెలతో ఎదురెళ్లి పూజారుల కాళ్లపై నీళ్లు పోసి ప్రణమిల్లారు. మంగళహారతులతో వనానికి స్వాగతం పలికారు. పూజారులు తాము తీసుకొచ్చిన వనాన్ని బొడ్రాయి వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గద్దెల వద్దకు తీసుకు వచ్చారు.

సాయంత్రమే కీలక ఘట్టం

ఇవాళ సాయంత్ర మహాజాతరలో కీలకఘట్టం ఆవిష్కృతం కానుంది. కుంకుమ భరిణె రూపంలోని సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు, వడ్డెల బృందం మధ్యాహ్నం మూడు గంటలకు చిలకలగుట్టపైకి చేరుకుంటుంది. ప్రధాన పూజారి ఒక్కరే గుట్టపైకి నడుచుకుంటూ వెళ్లి అక్కడ రహస్య ప్రదేశంలో ఉన్న సమ్మక్క వద్ద సుమారు మూడు గంటల పాటు పూజలు చేస్తారు. ఆ సమయంలో సమ్మక్క రాక కోసం లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు. పూజారిపై దేవత పూనిన వెంటనే కుంకుమ భరిణె రూపంలోని అమ్మవారిని తీసుకొని అతివేగంగా గుట్ట పైనుంచి కిందికి దిగి వస్తారు. సమ్మక్క ఆగమనానికి సూచనగా  జిల్లా ఎస్పీ  ‌‌ఏకే 47తో మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరుపుతారు. కలెక్టర్‌‌‌‌, ఇతర అధికార యంత్రాంగమంతా చిలుకలగుట్ట కిందే ఉంటుంది. సమ్మక్క ఎదుర్కోళ్ల కార్యక్రమానికి 500 మందికి పైగా పోలీసులను నియమించారు. రోప్‌‌‌‌ పార్టీని కూడా సిద్ధం చశారు. మూడంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు ములుగు ఎస్పీ తెలిపారు.