డిజిటల్ నెంబర్లు ఎప్పుడో?.. మున్సిపాలిటీల్లో ఒకే ఇంటి నెంబర్లపై బోలెడు ఇండ్లు

డిజిటల్ నెంబర్లు ఎప్పుడో?.. మున్సిపాలిటీల్లో ఒకే ఇంటి నెంబర్లపై బోలెడు ఇండ్లు
  •     మున్సిపాలిటీల్లో ఒకే ఇంటి నెంబర్లపై బోలెడు ఇండ్లు
  •     ప్రాపర్టీ టాక్స్ ఆదాయం కోల్పోతున్న ప్రభుత్వం
  •     డిజిటల్ నెంబర్లతో అక్రమాలకు చెక్‌‌ పెట్టాలని ఆదేశం
  •     గడువు దాటినా పట్టించుకోని అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ

సంగారెడ్డి, వెలుగు: మున్సిపాలిటీల్లో అక్రమ ఇంటి నెంబర్ల వ్యవహారం ఎటూ తేలడం లేదు. ప్రాపర్టీ టాక్స్‌‌లనుఎగ్గొట్టేందుకు కొందరు చేస్తున్న మోసాలను గుర్తించిన సర్కారు డిజిటల్ నెంబర్లు కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు బల్దియాలకు ఉత్తర్వులు జారీ చేసి 2023 మార్చిలోగా ప్రాసెస్‌‌ కంప్లీట్ చేయాలని అధికారులను ఆదేశించింది.  అధికారుల నిర్లక్ష్యమో, కాంట్రాక్ట్ చేపట్టిన  ఏజెన్సీ అలసత్వమో కానీ ఇప్పటి వరకు డిజిటల్ నెంబర్ల ప్రక్రియ మొదలు కాలేదు.  మున్సిపాలిటీల్లో మూడు, నాలుగు ఇండ్లకు ఒకే నెంబర్ ఇవ్వడం, కొన్ని ఇండ్లకు అక్రమంగా బై నెంబర్లు ఇచ్చి ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్సులను ఎగ్గొట్టడం లాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.  గ్రేడ్ వన్ మున్సిపాలిటీ సంగారెడ్డితో పాటు జహీరాబాద్, అమీన్‌‌పూర్‌‌‌‌, సదాశివపేట, తెల్లాపూర్ మున్సిపాలిటీలలో ఇలాంటి బాగోతాలు బయటపడినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. 

1.10 లక్షల ఇండ్లు

జిల్లాలోని 8 మున్సిపాలీట్లో మొత్తం 1.10 లక్షల ఇండ్లు ఉన్నాయి.  ఇందులో సంగారెడ్డిలో 22 వేలు, జహీరాబాద్‌‌లో 14 వేలు, సదాశివపేటలో 11 వేలు, నారాయణఖేడ్ లో 8,500, అందోల్ జోగిపేటలో 8 వేలు, తెల్లాపూర్ లో 15,500, అమీన్‌‌పూర్‌‌‌‌లో 17 వేలు, బొల్లారంలో 14 వేల ఇండ్లు ఉన్నట్లు మున్సిపల్ రికార్డులు చెబుతున్నాయి. అయితే కాలనీల్లో రూల్స్‌‌ పాటించకుండా అడ్డదిడ్డంగా నిర్మాణాలు చేపట్టినా.. అధికారులు ప్రాపర్ ఎంక్వైరీ లేకుండానే ఇంటి నెంబర్లు ఇస్తున్నారు. ఒకే ఇంటి నెంబర్‌‌‌‌ను మూడు, నాలుగు ఇండ్లకు కేటాయించడంతో ప్రాపర్టీ ట్యాక్సులు కట్టే టైంలోఇబ్బందులు ఎదురవుతున్నాయి.

డిజిటల్ నెంబర్లు వస్తే...

ప్రభుత్వ ఆదేశాల మేరకు పాత ఇంటి నెంబర్ల స్థానంలో డిజిటల్ నెంబర్లు కేటాయించి  కాలనీల పేర్లు, రోడ్ నెంబర్లు, ఇండ్ల అంతస్తులు వివరాల పక్కాగా నమోదు చేయాలి. ఈ వివరాలు భువన్ యాప్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేసి సిటిజన్స్‌‌కు అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. పక్కా సమాచారం ఉండడంతో ప్రాపర్టీ ట్యాక్స్‌‌ వసూళ్లకు ఇబ్బంది ఉండదు. అంతేకాదు క్రయ విక్రయాల సమయంలో రికార్డుల వెరిఫికేషన్‌‌ ఈజీ అవుతుంది. కానీ, అధికారుల నిర్లక్ష్యంతో డిజిటల్ నెంబర్ల ప్రక్రియను మొదలు పెట్టడం లేదు. అయితే అధికారులు మాత్రం తాము సహకరిస్తున్నామని,  ఏజెన్సీ నిర్లక్ష్యమే ఆలస్యానికి కారణమని చెబుతున్నారు. 

ఇవీ చదవండి : వెండితెరపై స్టార్ యాంకర్ రీ ఎంట్రీ.. కేవలం 6 రోజుల్లోనే కంప్లీట్

ఏజెన్సీ నిర్లక్ష్యం వల్లే

రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఏజెన్సీకి కాంట్రాక్టు ఇవ్వడం వల్ల ఆలస్యం అవుతోంది. జిల్లాలో డిజిటల్ నెంబర్ ప్రక్రియ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇండ్లకు డిజిటల్ నెంబర్ సిస్టం వస్తే ఆస్తి పన్నుల చెల్లింపులు వేగవంతం అవుతాయి. వాటిని లెక్కించడం కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పటివరకు ఎగవేసిన పన్నులతో పాటు దొంగ చాటుగా ఇచ్చిన ఇంటి నెంబర్లు కూడా బయటపడతాయి. 

- కృష్ణారెడ్డి, సదాశివపేట మున్సిపల్ కమిషనర్