
- హత్యకు దారి తీసిన ప్రేమ వ్యవహారం!
- కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు
- సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలో ఘటన
రామచంద్రపురం, వెలుగు: ప్రేమ వ్యవహారంలో యువతి ప్రాణాలు కోల్పోగా.. యువకుడికి సీరియస్ గా ఉన్న ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. వివరా లు ఇలా ఉన్నాయి. రామచంద్రాపురం పరిధిలోని బండ్లగూడ బాలాజీ నగర్ కు చెందిన రమ్య(23) డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. మూడేండ్లుగా ఆమె, ప్రవీణ్ అనే యువకుడు ప్రేమించుకుంటున్నారు. సోమవారం యువతి తల్లిదండ్రులు పనికి వెళ్లిన తర్వాత రమ్య ఇంటికి ప్రవీణ్ వచ్చాడు.
మధ్యాహ్నం 3 గంటల తర్వాత యువతి పేరెంట్స్ ఇంటికి వచ్చి చూసేసరికి ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. రమ్య చనిపోయి కనిపించగా.. ప్రవీణ్ కొన ఊపిరితో ఉండడంతో వెంటనే బీరంగూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. యువతి డెడ్ బాడీపై కత్తి గాట్లు ఉండడం, ఇద్దరికి రక్త గాయాలు కావడంతో అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రవీణ్‌కు సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రమ్యను చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడా..?
ప్రేమ వ్యవహారంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతోనే రమ్యపై కత్తితో దాడి చేసి ప్రవీణ్ కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడా..? లేక ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో విచారిస్తూ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ వివరాలు సేకరించింది.