చిన్న బడ్జెట్ తో తెరకెక్కించి సక్సెస్ అందుకున్న కన్నడ కామెడీ చిత్రం 'అరసయ్యన ప్రేమ ప్రసంగ' . ఈ మూవీలో మహాంతీష్ హిరేమఠ్, రష్మితా గౌడా ప్రధాన పాత్రలో నటించారు. జెవీఆర్ డీపు డైరెక్షన్ లో మేఘశ్రీ రాజేష్ దీనిని నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను నవ్వులు పూయిస్తోంది. సెప్టెంబర్ 19న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. సన్ నెక్ట్స్ తో స్ట్రీమింగ్ అవుతూ దూసుకెళ్తోంది. కన్నడ ఒరిజినల్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ వెర్షన్స్ లో అందుబాటులో ఉంది.
పోస్ట్ మాస్టర్ తో కొత్త ప్రేమ కథ
ప్రతి మనిషికి ఒక కల ఉంటుంది. హీరో అరసయ్య అనే పూజారి (మహంతేష్ హిరేమత్) కల కూడా అంతే సింపుల్.. ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం! కానీ అరసయ్యకు ఒక లోపం ఉంది- వినికిడి లోపం. హియరింగ్ మెషిన్ పెట్టుకుంటే తప్ప ప్రపంచం మాట అతనికి వినిపించదు. పైగా పెద్దగా చదువుకోలేదు. ఈ లోపాల కారణంగా, అతను పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా అమ్మాయిలు తిరస్కరిస్తూ ఉంటారు. అరసయ్య జీవితం నిరాశతో సాగుతున్న సమయంలో, వారి పల్లెటూరుకు కుమారి (రష్మిత ఆర్ గౌడ) పోస్టాఫీస్ ఉద్యోగినిగా ట్రాన్స్‌ఫర్‌పై వస్తుంది. అరసయ్య మొదటి చూపులోనే కుమారి అందానికి, వ్యక్తిత్వానికి మనసు పారేసుకుంటాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, కుమారి హృదయాన్ని గెలుచుకోవడం అరసయ్యకు అంత తేలిక కాదు. ఆమె చదువుకున్న, ఆధునిక భావాలున్న అమ్మాయి కాగా, అరసయ్య అమాయకుడు, వినికిడి లోపంతో ఇబ్బంది పడేవాడు. ఈ నేపథ్యంలో, ఆమె దృష్టిని ఆకర్షించడానికి అరసయ్య పడే పాట్లు, చేసే ప్రయత్నాలు ప్రేక్షకులకు హాస్యాన్ని, ఆలోచనను అందిస్తాయి.
స్నేహం బలం, సవాళ్ల పయనం
అరసయ్య ఈ ప్రేమ ప్రయాణంలో అతనికి ప్రాణ స్నేహితుడు, ఆటో డ్రైవర్ అయిన బసవ (పీడీ సతీష్) ఎప్పుడూ అండగా నిలబడతాడు. అరసయ్యకు ఎదురయ్యే ప్రతి సవాలును బసవ తన హాస్యంతో కూడిన సలహాలు, సహాయంతో ఎదుర్కోవడంలో తోడ్పడతాడు. దర్శకుడు జెవిఆర్ దీపు ఈ కథలో వినికిడి లోపం ఉన్న వ్యక్తి ప్రేమను వెతకడం అనే సున్నితమైన అంశాన్ని పల్లెటూరి వాతావరణం, హాస్యం, అమాయకత్వంతో మేళవించారు. అరసయ్య-కుమారిల విరుద్ధమైన వ్యక్తిత్వాల మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం, అపోహలు కూడా వీరి ప్రేమకథలో కొన్ని అనూహ్య మలుపులకు కారణమవుతాయి.
ఈ కన్నడ చిత్రం గ్రామీణ నేపథ్యం, స్వచ్ఛమైన భావోద్వేగాల కలబోతగా ఉంటుంది. మరి ఈ వినికిడి లోపం ఉన్న పూజారి తన లోపాలన్నింటినీ దాటుకొని, అందమైన కుమారి ప్రేమని ఎలా గెలుచుకున్నాడు? లేదా? అన్నది తెలుసుకోవాలంటే మీరు సన్‌నెక్స్ట్లో ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
