ఐదేళ్లుగా ఆరు వేలే : పర్మినెంట్ ఆశతోనే పని

ఐదేళ్లుగా ఆరు వేలే : పర్మినెంట్ ఆశతోనే పని

హాస్టళ్లు మొదలైనప్పటి నుంచి ఒకటే జీతం
పర్మనెంట్‌‌ చేస్తారనే ఆశతో చేస్తున్న వర్కర్లు

హైదరాబాద్, వెలుగుమోడల్‌‌ స్కూళ్ల హాస్టళ్లలో పని చేస్తున్న సిబ్బంది జీతాలు పెంచమని వేడుకుంటున్నరు. ఐదేండ్లుగా పని చేస్తున్నా పైసా పెంచలేదని వాపోతున్నరు. జాబులూ పర్మనెంట్‌‌ కాలేదని, ఇప్పటివరకు కనీసం ఐడీ కార్డులూ ఇవ్వలేదని అంటున్నరు. తమ గోడును జర పట్టించుకోవాలని, జీతం పెంచేలా చూడాలని కోరుతున్నరు.

ఐడీ కార్డులు కూడా ఇయ్యలే

రాష్ర్టంలో 194 మోడల్‌‌ స్కూల్స్‌‌ ఉండగా వీటిల్లో 170 స్కూళ్లకు అనుబంధంగా గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. హాస్టళ్లను 2014–15లో ప్రారంభించారు. ఒక్కో హాస్టల్‌‌లో 100 మందికి వసతి కల్పిస్తున్నారు. హాస్టళ్ల​నిర్వహణకు ఆరు పోస్టులను క్రియేట్ చేసి కేర్​టేకర్‌‌తో పాటు ఏఎన్‌‌ఎం, వాచ్ఉమెన్, హెడ్​కుక్ తదితర సిబ్బంది పోస్టులను భర్తీ చేశారు. వీళ్ల జీతాలను మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటివరకూ కనీసం ఐడీకార్డులు కూడా అధికారికంగా ఇవ్వలేదు. 8 గంటల డ్యూటీనే అని చెబుతూ అంతకుమించి పని
చేయించుకుంటున్నారు.

అంతా రూ.50 వేలల్లోనే

ఒక్కో హాస్టల్‌‌కు ప్రభుత్వం నెలకు రూ. లక్షన్నర ఇస్తోంది. దీంట్లో ఒక్కో స్టూడెంట్‌‌కు నెలకు రూ. వెయ్యి చొప్పున ఖర్చుచేస్తే రూ. లక్ష పోను మిగిలిన రూ.50 వేలతోనే హాస్టల్ నిర్వహణ జరగాలి. దీనిలోనే ఆరుగురు సిబ్బందికీ జీతాలివ్వాలి. కేర్‌‌ టేకర్‌‌, వాచ్‌‌ ఉమెన్‌‌కు రూ.6,700.. ఏఎన్‌‌ఎం, హెడ్‌‌ కుక్‌‌కు రూ.6 వేలు, ఇద్దరు అసిస్టెంట్‌‌ కుక్స్‌‌కు రూ.5 వేల జీతం ఇస్తున్నారు. స్వీపర్, అకౌంటెంట్ లేకపోవడంతో వాచ్ ఉమెన్‌‌తో పాటు ఇతర సిబ్బందే ఆ పని చేస్తున్నారు. హాస్టల్స్​మొదలైనప్పటి నుంచీ అదే జీతం ఇస్తున్నా పర్మినెంట్ చేయకపోతారా అనే ఆశతో పని చేస్తున్నారు.

శాఖ ఒక్కటే.. జీతాలు వేరు

మోడల్ స్కూళ్లతో పాటు కస్తూర్బా గాంధీ బాలిక స్కూళ్లు సమగ్ర శిక్షా అభియాన్​(ఎస్‌‌ఎస్‌‌ఏ) పరిధిలోనే కొనసాగుతున్నాయి. ఈ రెండింటిలో ఒకేరకం పని చేసే సిబ్బంది జీతాలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. ప్రస్తుతం కేజీబీవీ ఏఎన్ఎంకు నెలకు రూ.11వేలు ఉంటే మోడల్ స్కూళ్ల ఏఎన్‌‌ఎంకు రూ.6 వేలే ఉంది. ఇతర సిబ్బంది వేతనాల్లోనూ కేజీబీవీ సిబ్బందితో పోలిస్తే మోడల్ స్కూల్ వాళ్లకు తక్కువగానే ఉంది. పైగా 10 నెలలకే జీతాలిస్తున్నారు.

ప్రతిపాదనలు పంపుతం

మోడల్ స్కూల్స్ హాస్టళ్లలో పని చేసే సిబ్బందికి జీతాలు తక్కువే. నెలకు రూ.1.50 లక్షల్లోనే హాస్టల్ నిర్వహణంతా జరగాలి. స్కూళ్లు ఆర్‌ ఎంఎస్‌ ఏ నుంచి ఎస్​ఎస్‌ ఏ పరిధిలోకి వచ్చాయి. వచ్చే ప్లానింగ్‌ అప్రూవల్‌‌ బోర్డు (పీఏబీ) సమావేశాల్లో జీతాల పెంపు ప్రతిపాదనలు పంపుతాం.

 – సత్యనారాయణరెడ్డి, మోడల్ స్కూల్స్​ డైరెక్టర్

see also: మార్చి 31 వరకు కరోనా సెలవులు

ఒక్కొక్కరు ఆరుగుర్ని కనండి