V6 News

ప్రాణం పోయినా వీడని బంధం: ఆమె చనిపోయిన సమాధి దగ్గరే కాపలా కాస్తున్న వీధి కుక్క!

ప్రాణం పోయినా వీడని బంధం: ఆమె చనిపోయిన సమాధి దగ్గరే కాపలా కాస్తున్న వీధి కుక్క!

కేరళలోని మలప్పురం జిల్లాలో మనసును కదిలించే ఒక  ఘటన జరిగింది. తనను కన్నబిడ్డలా చూసుకున్న ఓ మహిళ చనిపోతే, ఆ కుక్క ఆమె సమాధిని విడిచి వెళ్లకుండా అక్కడే ఉండిపోయిన తీరు నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తోంది. ఈ సంఘటనకి సంబంధించిన వివరాలు చూస్తే... 

మలప్పురం జిల్లాకు చెందిన అమీనా అనే మహిళకు మూగజీవాలంటే చాలా ప్రేమ. ఆమె తన ఇంటి దగ్గర తిరిగే ఒక వీధి కుక్కకు రోజూ అన్నం పెడుతూ, ప్రేమగా చూసుకునేది. దీంతో ఆ కుక్క ఆమెకు బాగా అలవాటైపోయింది. అమీనా ఎప్పుడు బయటకు వస్తుందా అని అది ఎదురుచూస్తూ ఉండేది.

ప్రాణాలు కాపాడాలని
కొన్ని రోజుల క్రితం అమీనా నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా రోడ్డుపైనే పడిపోయారు. ఇది గమనించిన ఆ కుక్క ఆమె ప్రాణాలు కాపాడాలని గట్టిగా మొరగడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల వారు ఆ అరుపులు విని అక్కడికి వచ్చి చూసేసరికి అమీనా స్పృహ లేకుండా పడిపోయి ఉంది. "కుక్క అలా అరవకపోయి ఉంటే అసలు ఆమె అక్కడ పడిపోయారన్న విషయం మాకు తెలిసేది కాదు" అని స్థానికులు చెప్పారు. అయితే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఫలితం లేకుండా పోయింది, అమీనా  అప్పటికే కన్నుమూశారు.

సమాధి దగ్గరే కాపలా
అమీనా అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు ఆ కుక్క ఆమె వెంటే ఉంది. ఆమెను ఖననం చేసిన మసీదు వరకు వెళ్లడమే కాకుండా, అందరూ తిరిగి వచ్చేసినా అది మాత్రం అక్కడే ఉండిపోయింది. గత మూడు రోజులుగా ఆ కుక్క ఆమె సమాధి దగ్గరే పడుకొని ఉంటోంది. ప్రతిరోజూ అమీనా కుటుంబ సభ్యులు ప్రార్థనల కోసం సమాధి దగ్గరకు వెళ్లినప్పుడు, ఆ కుక్క కూడా వారితో పాటే వెళ్లి అక్కడ నిశ్శబ్దంగా కాపలా కాస్తోంది.

జంతువులకు కూడా భావోద్వేగాలు ఉంటాయని, ముఖ్యంగా వాటిని ప్రేమగా చూసుకుంటే అవి ప్రాణం పోయినా మర్చిపోవని ఈ సంఘటన నిరూపించింది. అమీనా చూపిన ప్రేమ.. ఈ రోజు ఆ మూగజీవిని ఆమె సమాధి దగ్గర కాపలా ఉండేలా చేసింది. ప్రస్తుతం ఆ విధి కుక్క విశ్వాసానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.