
- పాత కనెక్షన్‌ను కొనసాగిస్తూనే కొత్త కంపెనీకి లేదా డీలర్‌కి మారొచ్చు
- త్వరలో మార్గదర్శకాలను ప్రకటించనున్న పీఎన్‌జీఆర్‌బీ
న్యూఢిల్లీ: మీ ఎల్‌పీజీ డీలర్ లేదా కంపెనీపై అసంతృప్తిగా ఉన్నారా? అయితే మొబైల్ నంబర్ పోర్టబిలిటీ మాదిరి, కస్టమర్లు త్వరలో తమ వంటగ్యాస్ సరఫరాదారుడిని మార్చుకోవచ్చు. అదే కనెక్షన్‌ను కొనసాగిస్తూ, మెరుగైన సేవల కోసం మరో సరఫరాదారుడిని ఎంచుకునే స్వేచ్చ ఉంటుంది.
పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ (పీఎన్‌జీఆర్‌బీ) తాజాగా ఎల్‌పీజీ ఇంటరాపరబిలిటీ ఫ్రేమ్‌వర్క్‌పై ప్రజాభిప్రాయాలను ఆహ్వానించింది. స్థానిక డీలర్ సేవల్లో అంతరాయం ఏర్పడినప్పుడు, వినియోగదారులకు ప్రత్యామ్నాయాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సంస్థ పేర్కొంది.
“సిలిండర్ ధర ఒకటే ఉన్నప్పుడు, ఎల్‌పీజీ కంపెనీ/డీలర్‌ను ఎంచుకునే స్వేచ్చ వినియోగదారుడికి ఉండాలి” అని నోటీసులో పేర్కొంది. 2013లో యూపీఏ ప్రభుత్వం 13 రాష్ట్రాల్లో 24 జిల్లాల్లో ఎల్‌పీజీ పోర్టబిలిటీ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.
2014లో 480 జిల్లాలకు ఇది విస్తరించింది. అయితే, అప్పట్లో కస్టమర్లు ఒకే కంపెనీకి చెందిన డీలర్ల మధ్య మాత్రమే మారే అవకాశం పొందారు. సిలిండర్ రీఫిల్ చేయడానికి అదే కంపెనీకి తిరిగి ఇవ్వాల్సిన రూల్ ఉండడంతో ఇండేన్ వినియోగదారుడు భారత్ గ్యాస్ లేదా హెచ్‌పీ గ్యాస్‌కు మారే అవకాశం లేదు.
ఇప్పుడు పీఎన్‌జీఆర్‌బీ ఇంటర్-కంపెనీ పోర్టబిలిటీను చట్టబద్ధంగా అనుమతించేందుకు చర్యలు తీసుకుంటోంది. అంటే వేరే కంపెనీకి కూడా మారొచ్చు. దేశవ్యాప్తంగా 32 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు ఉన్నాయి.
ప్రతి సంవత్సరం 17 లక్షల వినియోగదారుల ఫిర్యాదులు నమోదవుతున్నాయి. పీఎన్‌జీఆర్‌బీ ప్రకారం, సమయానికి రీఫిల్ అందకపోవడం, డీలర్ సస్పెన్షన్, డెలివరీలో ఆలస్యం వంటి సమస్యలను వినియోగదారులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.
2014 స్కీమ్‌లో 1,400 క్లస్టర్లు ఏర్పాటు చేసి, ప్రతి క్లస్టర్‌లో సగటున 4 డీలర్లను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడు అంతరాయాల సమయంలో సమీప డీలర్ నుంచి సేవలు పొందేలా పీఎన్‌జీఆర్‌బీ కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. అక్టోబర్ మధ్య వరకు ప్రజాభిప్రాయాలను స్వీకరించి, దేశవ్యాప్తంగా అమలు తేదీని నిర్ణయించనుంది.