ఎల్ఆర్ఎస్ ఎంక్వైరీ అంత ఈజీ కాదు!

ఎల్ఆర్ఎస్ ఎంక్వైరీ అంత ఈజీ కాదు!
  • రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షలకు పైగా అప్లికేషన్లు   
  •   జిల్లాల్లో స్టాఫ్​ అంతంత మాత్రమే

 

వరంగల్/జనగామ, వెలుగు: ఎల్ఆర్ఎస్ కింద స్టేట్​వైడ్​ అక్రమ లేఅవుట్లను రెగ్యులరైజ్​ చేసి ఖజనా నింపుకోవాలన్న రాష్ట్ర సర్కారు ఆలోచన ఎలా ఉన్నా ఫీల్డ్​ లెవల్​లో ఆఫీసర్లకు ఇబ్బందులు తప్పేలా లేవు. ముఖ్యంగా కార్పొరేషన్లు, పట్టణాల్లో సరిపడా స్టాఫ్​ లేకపోవడం, గత అనుభవాల నేపథ్యంలో ఆఫీసర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం స్టేట్​వైడ్ ​ఎల్ఆర్ఎస్​ కింద 25 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. అప్లికేషన్ ఫీజుల రూపంలోనే సర్కారుకు రూ.255 కోట్లకు పైగా ఇన్​కమ్​ ​సమకూరింది. ఈ మేరకు మున్సిపల్ ఆఫీసర్లు సర్వే నంబర్ల వారీగా ప్లాట్లను క్లస్టర్లుగా విభజిస్తున్నారు. ఈ తంతు పూర్తి కాగానే ఫీల్డ్ లెవల్ ఎంక్వైరీ మొదలుపెట్టనున్నారు. స్టాఫ్ ​తక్కువగా ఉన్నందున ఎంతకాలం పడుతుందో అంతుచిక్కడం లేదు. ఎంక్వైరీలో ఇతర శాఖల సిబ్బంది సేవలను వాడుకోవడం మినహా మరో గత్యంతరం లేదంటున్నారు.  ఎందుకంటే ప్రతి ప్లాట్ ను పరిశీలించి అప్లికేషన్​లో పొందుపరిచిన వివరాలు సరిగా ఉన్నాయో లేదా చెక్ చేయాల్సి ఉంటుంది. తప్పుడు వివరాలు ఉంటే రిజెక్ట్ చేస్తారు. శిఖం, ఎఫ్టీఎల్, కెనాల్​ల సమీపం, దేవాదాయ, వక్ఫ్ భూములు తదితర ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ పర్మిషన్ లేదు. అయినా ఇటువంటి అప్లికేషన్లు ఎక్కువగానే వచ్చినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. వీటన్నింటినీ క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయాల్సి ఉంది.  ఎంక్వైరీ టీమ్​లో మున్సిపల్ ఉద్యోగి తో పాటు, రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు చెందిన ఆఫీసర్లు ఉండనున్నట్లు చెబుతున్నారు.

పెద్ద సంఖ్యలో సిబ్బంది కావాలె

ఎల్ఆర్ఎస్ తో లింకు పెట్టడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంపైనా పడింది. ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం ఇచ్చే ఈ రంగం ఎంతోమందికి ఉపాధిని కూడా కల్పిస్తోంది. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఇంకా మొదలు కాకపోవడంతో ఎంతోమంది సతమతమవుతున్నారు. గతంలో ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన అప్లికేషన్లను ఆఫీసర్లు సీరియల్‌‌‌‌ పద్ధతి ప్రకారం స్థలాల పరిశీలన, డిస్పోజ్‌‌ చేశారు. ఇలా చేయడం వల్ల గ్రౌండ్ లెవల్​లో పరిశీలనకు సిబ్బంది వెళ్లాల్సి వచ్చేది. ఒక్కో స్థలం కోసం ఇలా వెళ్లాలంటే ప్రస్తుతం వచ్చిన 25 లక్షల దరఖాస్తులకు చాలామంది సిబ్బంది అవసరం. ఒక్కో ప్రాంతాన్ని క్లస్టర్​గా విభజించి పరిష్కరించాలని ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రక్రియలో కూడా పెద్దఎత్తున సిబ్బంది అవసరం ఉంటుంది. అవుట్ సోర్సింగ్ విధానంలో సిబ్బందిని తీసుకోవాలన్న నిర్ణయం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. ప్రభుత్వ ఆమోదం పొంది, రిక్రూట్ చేసుకుని క్రమబద్ధీకరణ పూర్తి చేసేసరికి ఎంతకాలం పడుతుందోనన్న అనుమానాలు అందరినీ వెంటాడుతున్నాయి. మరోవైపు కొన్ని రోజులుగా అప్లికేషన్ల స్క్రూటినీ పనిలో ఉన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు  ఫీల్డ్ లెవల్ ఎంక్వైరీ గైడ్ లైన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఔట్​సోర్సింగ్​ పద్ధతిలో రిక్రూట్మెంట్

వరంగల్ నగర పాలక సంస్థలో సిబ్బంది కొరత ఉన్నది వాస్తవమే. గతంలో కంటే అత్యధికంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిష్కరించేందుకు సిబ్బంది కొరత విషయాన్ని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లాం. దీంతో ఔట్​సోర్సింగ్​ పద్ధతిన రిక్రూట్​మెంట్​కు ఆయన ఓకే చెప్పారు.  అందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. ప్రస్తుతానికి  ఆ ప్రక్రియ కొనసాగుతోంది. కోర్టు డైరెక్షన్​ మేరకు ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేస్తాం.

–గుండా ప్రకాశ్​రావు, మేయర్, జీడబ్ల్యూఎంసీ

స్టాఫ్ 12 మంది.. అప్లికేషన్లు లక్ష

వరంగల్ సిటీలో 2015లో ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ కింద రెగ్యులరైజేషన్​ కోసం 23,500 అప్లికేషన్లు వచ్చాయి. వీటిని ఫీల్డ్​ లెవల్​లో ఎంక్వైరీ చేసి పరిష్కరించేందుకు ఇక్కడి ఆఫీసర్లకు దాదాపు నాలుగేళ్ల టైం పట్టింది. ఇప్పటికీ వేలాది అప్లికేషన్లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. కానీ ఈసారి అప్లికేషన్ల సంఖ్య లక్ష దాటింది. గతంలో కుడా(కాకతీయ అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ)లో నలుగురు ఆఫీసర్లే  అర్జీలన్నీ పరిశీలించారు. లేటవుతోందని పబ్లిక్​నుంచి ఫిర్యాదులు రావడంతో జీడబ్ల్యూఎంసీ టౌన్‌‌ ప్లానింగ్‌‌ సేవలు వినియో గించుకున్నారు. కానీ ప్రస్తుతం టౌన్​ ప్లానింగ్​లో 12 మంది స్టాఫ్​ మాత్రమే ఉన్నారు. ఇంత తక్కువ  సిబ్బందితో లక్ష అప్లికేషన్ల పరిష్కారం ఎలా అనే ప్రశ్న వస్తోంది. స్టాఫ్​ కొరత దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగానూ  గడువులోగా ఎల్ఆర్ఎస్​ ప్రాసెస్​ కంప్లీట్​ చేయడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.