LSG vs DC: జేక్ ఫ్రేజ‌ర్ మెరుపులు.. ఢిల్లీ ఖాతాలో రెండో విజయం

LSG vs DC: జేక్ ఫ్రేజ‌ర్ మెరుపులు.. ఢిల్లీ ఖాతాలో రెండో విజయం

హ్యాట్రిక్ విజ‌యాల‌తో జోరుమీదున్న ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు.. ఢిల్లీ క్యాపిటల్స్ అడ్డుకట్ట వేసింది. వారి సొంత మైదానంలోనే మట్టి కరిపించి.. రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 167 పరుగులు చేయగా.. ఢిల్లీ బ్యాటర్లు మరో 11 బంతులు మిగిలివుండగానే ఆ లక్ష్యాన్ని చేధించారు. ఢిల్లీ బ్యాటర్లలో జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్(55; 35 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. కెరీర్‌లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన జేక్.. తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.  

ల‌క్నో నిర్దేశించిన 168 ప‌రుగుల ఛేద‌న‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. డేంజ‌ర‌స్ ఓపెన‌ర్ డేవిడ్ వార్నర్(8) ఔట‌య్యాడు. య‌శ్ ఠాకూర్ ఓవ‌ర్లో లెగ్ సైడ్ షాట్ ఆడ‌బోయాడు. కానీ, ప్యాడ్‌కు త‌గిలిన బంతి ఒక్క బౌన్స్‌తో వికెట్లను తాకింది. దీంతో 24 ప‌ర‌గులు వ‌ద్ద ఢిల్లీ మొద‌టి వికెట్ పడింది. ఆ సమయంలో పృథ్వీ షా(32), జేక్ ఫ్రేజ‌ర్ మెక్‌గుర్క్‌‌లు ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 39 ప‌రుగులు జోడించారు. 

మంచి భాగస్వామ్యం లభించింది అన్న సమయాన భారీ షాట్‌కు యత్నించి పృథ్వీ షా వెనుదిరిగాడు. ఆ సమయంలో మ్యాచ్ ఆసక్తిగా అనిపించింది. అయితే, క్రీజులోకి వచ్చిన పంత్.. మెక్‌గుర్క్‌‌తో కలిసి స్కోరు వేగాన్ని పెంచాడు. మోదట్లో ఆచి తూచి ఆడిన జేక్ కుదరకున్నాక.. వరుస సిక్సర్లతో హోరెత్తించాడు. కృనాల పాండ్యా వేసిన 13వ ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్స్ లు బాదాడు. చివరలో పంత్, జేక్ ఔటైనా.. షాయ్ హోప్( 11నాటౌట్), స్టబ్స్(15 నాటౌట్) మిగిలిన పని పూర్తి చేశారు.

ఆదుకున్న బడోని

అంతకుముందు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సొంత మైదానంలో త‌డ‌బ‌డింది. డికాక్(19), రాహుల్(39), పడిక్కల్(3), స్టోయినిస్(8), పూరన్(0) వంటి బ్యాటర్లు విఫలమైన చోట యువ బ్యాటర్ ఆయుష్ బడోని(55 నాటౌట్) ఆదుకున్నాడు. ఢిల్లీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు.