ఒక్క రోజులో కోటీశ్వరుడైన అంబులెన్స్ డ్రైవర్

ఒక్క రోజులో కోటీశ్వరుడైన అంబులెన్స్ డ్రైవర్

అదృష్టం ఆవగింజంతైనా ఉండకపోతే ఏదీ కలిసిరాదంటారు. ఇది అక్షరాల ఓ డ్రైవర్ విషయంలో నిజమైంది. పశ్చిమ బెంగాల్‌ లోని తూర్పు బర్ధమాన్ జిల్లాకు చెందిన షేక్ హీరా అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయన పనిచేస్తేనే కానీ ఇల్లు గడవదు. పైగా ఆయన తల్లికి అనారోగ్యం. ఆమెకు చికిత్స చేయించాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. ఇన్ని ఇబ్బందులు ఉన్నా షేక్ ఏ రోజు అధైర్యపడలేదు. తన కష్టాన్నే నమ్ముకొని జీవితం కొనసాగిస్తున్నాడు. అయితే షేక్ కు ఒక అలవాటుంది. తరచుగా లాటరీ టికెట్లు కొంటూ ఉంటాడు. ఓ రోజు ఉదయం కూడా ఎప్పటిలాగే రూ. 270 పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు. అదే రోజు మధ్యాహ్నం లాటరీ డ్రా తీశారు. అందులో షేక్ కు కోటి రూపాయల జాక్‌పాట్ తగిలింది. అది విన్న షేక్ కు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే లాటరీ టికెట్ సహా శక్తిగఢ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తనకు కోటి రూపాయల లాటరీ వచ్చిందని.. ఆ టికెట్ ఎవరైనా కొట్టేస్తారేమోనని మీ దగ్గరకు వచ్చినట్లు చెప్పాడు. వెంటనే పోలీసులు ఆయనను సేఫ్ గా ఇంటికి చేర్చి.. ఇంటి ముందు కాపలా పెట్టారు. తనకొచ్చిన లాటరీ డబ్బులతో తన తల్లి ఆరోగ్యం బాగు చేయిస్తానని, తన కుటుంబం ఉండటానికి ఓ మంచి ఇల్లు నిర్మించుకుంటానని షేక్ చెప్పాడు. ‘నేను ఏదో ఒక రోజు జాక్‌పాట్ గెలుస్తానని కలలు కనేవాడిని. ఆ ఆశతోనే టికెట్లు కొంటూ ఉండేవాడిని.  ఇంతకాలానికి అదృష్టం నా చెంత చేరింది’ అని షేక్ అన్నాడు. 

ఈ లాటరీ టిక్కెట్‌ను విక్రయించిన షేక్‌ హనీఫ్‌ మాట్లాడుతూ.. ‘నేను చాలా ఏళ్లుగా లాటరీ టికెట్‌ వ్యాపారం చేస్తున్నా. చాలా మంది నా షాప్‌ నుంచి టిక్కెట్లు కొంటూ ఉంటారు. వాటిలో కొన్ని టికెట్లకు  అప్పుడప్పుడు రివార్డులు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి జాక్‌పాట్‌ ప్రైజ్‌ మాత్రం ఇంతకు ముందు నా షాప్‌ నుంచి ఎవరికీ రాలేదు. ఇంత పెద్ద మొత్తంలో జాక్‌పాట్ గెలుచుకున్న టికెట్ నా షాపులో కొనుగోలు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’ అన్నారు.