చెట్ల రింగుల్లో క్లైమేట్​చేంజ్​ రహస్యాలు

చెట్ల రింగుల్లో క్లైమేట్​చేంజ్​ రహస్యాలు

వాతావరణంలో మార్పులకు కారణం అడవుల నరికివేత, ఫ్యాక్టరీలు, బండ్ల వల్ల కలిగే కాలుష్యమని తెలిసిందే కదా. ఆ మార్పులకు ప్రత్యక్ష సాక్షులుగా ఉంటున్నది చెట్లే. అంతేకాదు, ఆ వాతావరణ మార్పుల రహస్యాలను తమ కడుపులో దాచుకుంటున్నాయవి. ఉత్తర్​ప్రదేశ్​ లక్నోలోని బీర్బల్​ సాహ్ని ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ పాలియోసైన్సెస్​ (బీఎస్​ఐపీ) సైంటిస్టులు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. 900 ఏళ్ల వయసున్న సీడర్​ (క్రిస్మస్​ ట్రీ లాంటివి) చెట్ల ఎదుగుదలను పరిశీలించిన సైంటిస్టులు, వాటి రింగుల్లోని (ఎదిగే క్రమంలో చెట్టు కాండంలోపల ఏర్పడేవి) మార్పులను గుర్తించారు.

హిమాలయాల్లో పరిశోధన

హిమాచల్​ప్రదేశ్​లోని లహౌల్​–స్పితి జిల్లాలో 3,200 మీటర్ల ఎత్తులోని హిమాలయాల్లో ఇనిస్టిట్యూట్​ ప్రొఫెసర్​ క్రిష్ణ జి. మిశ్రా నేతృత్వంలోని సైంటిస్టులు సీడర్​ చెట్లపై పరిశోధన చేశారు. తరచూ వస్తున్న తీవ్రమైన కరువులకు కారణాలేంటో తెలుసుకునేందుకు ఆ చెట్లను తమ పరిశోధనకు ఎంచుకున్నారు. డెండ్రోక్రోనాలజీ (ట్రీ రింగ్​ డేటింగ్​.. అంటే రింగుల టైంను తెలుసుకునే పద్ధతి) ద్వారా ఆ చెట్ల కాండాల్లోని రింగులు ఎప్పుడు ఏర్పడ్డాయో తెలుసుకున్నారు. వాటికి తగ్గట్టు వాతావరణ పరిస్థితులు ఎప్పుడెప్పుడు ఎలా ఉన్నాయో అంచనా వేశారు.

ఆరు తీవ్ర కరువులు

చెట్ల రింగులను డేటింగ్​ చేయడం ద్వారా 1100వ సంవత్సరం నుంచి ఆరు తీవ్రమైన కరువులు వచ్చాయని సైంటిస్టులు గుర్తించారు. 1554, 1626, 1705, 1785, 1971, 2008లో పశ్చిమ హిమాలయ ప్రాంతాన్ని కరువులు కష్టపెట్టాయని తేల్చారు. 1437 నుంచి 2016 మధ్య వచ్చిన నాలుగు కరువులకు మధ్య టైం గ్యాప్​ 580 ఏళ్లుంటే, 1971 నుంచి ఇప్పటిదాకా 37 ఏళ్లలోనే రెండు తీవ్రమైన కరువులు సంభవించాయని గుర్తించారు. మొదటి రెండు కరువుల మధ్య టైం గ్యాప్​ 72 ఏళ్లు కాగా, రెండు, మూడో కరువుకు మధ్య 79, మూడు, నాలుగో కరువుకు 80, నాలుగు, ఐదుకు మధ్య 186 ఏళ్లు, ఐదు, ఆరో కరువుకు మధ్య 37 ఏళ్ల తేడా ఉన్నట్టు కనుగొన్నారు. అయితే, ఈ కరువులన్నింటికి కారణం గ్లోబల్​ వార్మింగా లేదా వేరే ఇతర కారణాలున్నాయా అన్నది తెలుసుకోవాల్సి ఉందని మిశ్రా చెప్పారు. 2017లో సీడర్​ చెట్ల శాంపిళ్లను సేకరించినట్టు వివరించారు.

చెట్టుకు ఏటా ఒక రింగు

ప్రతి చెట్టుకు కాండంలో ఏటా ఒక రింగు ఏర్పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ ప్రతి రింగులోనూ ఆ ఏడాది వాతావరణానికి సంబంధించిన సమాచారం ఉంటుందంటున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ ఆ టైంలో ఏర్పడిన కరువులు, వాతావరణ పరిస్థితులను తెలుసుకునేందుకు సైంటిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. లక్నోలో జరుగుతున్న ఆరో ఏషియన్​ డెండ్రోక్రోనాలజీ కాన్ఫరెన్స్​లో సీడర్​ చెట్లపై చేసిన పరిశోధన పేపర్​ను సైంటిస్టులు సబ్​మిట్​ చేశారు.