పంజాబ్ లూథియానాలో 8.49 కోట్ల దోపిడీ కేసును పోలీసులు 60 గంటల్లో ఛేదించారు. ఈ కేసులోని 10 మంది నిందితుల్లో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. రూ. 5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఏం జరిగిదంటే..
జూన్ 10న లూథియానాలోని రాజ్‌గురు నగర్ సమీపంలోని సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ కార్యాలయంలో రూ.8.49 కోట్ల దోపిడీ జరిగింది. మన్‌దీప్ కౌర్ అనే మహిళతో పాటు మరో 9 మంది ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఇందులో మన్‌దీప్ కౌర్, మంజీందర్ మణి సహా ఇద్దరు సూత్రధారులు. అయితే మణి అనే వ్యక్తి నాలుగేళ్లుగా సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ లో పనిచేస్తున్నాడు. ఈ దోపిడీ గురించి కొన్ని నెలలుగా ప్లాన్ చేస్తున్నారు. దోపిడీ కోసం రెండు ప్లాన్ లు వేశారు. ఇందులో భాగంగా ఒకరు మోటార్ సైకిల్‌పై, ఒకరు కారుపై ఉన్నారు. మణి ఐదుగురు నిందితులతో రెండు బైక్‌లపై, మన్‌దీప్ కౌర్ నలుగురు నిందితులతో కలిసి సీఎంఎస్ ఇన్ఫో క్యాష్ వ్యాన్ లో డబ్బుతో ఉడాయించారు.
ఎలా దొరికారంటే..
అయితే నోట్లకట్టలతో దొంగలు పారిపోగా..మన్‌దీప్ కౌర్ సోదరుడు నోట్ల కట్టలతో రీల్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ఈ కేసులో నిందితులను పట్టించింది. ఇన్ స్టాగ్రామ్ రీల్ చూసిన పోలీసులు..దోపిడీని ఛేదించారు. అయితే మన్‌దీప్ కౌర్ వద్ద అత్యధిక మొత్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
5 నెలల క్రితమే ప్లాన్..
గత ఐదు నెలలుగా ఈ దోపిడీకి కుట్ర జరుగుతోందని పోలీసులు తెలిపారు. మంజిందర్ మణి రాత్రికి రాత్రే ధనవంతుడై విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. అయితే మన్‌దీప్ కౌర్ న్యాయవాది. ఆమె తరచూ కోర్టుకు వచ్చినప్పుడు, ఆమె అక్కడ మంజిందర్ మణిని కలిసేది.
ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేసిన సంస్థ రూ.7 కోట్లు దోచుకున్నట్లు గతంలో ప్రకటించిందని.. అయితే రూ.8.49 కోట్లు దోచుకుందని చెప్పారని .లూథియానా పోలీస్ కమిషనర్ మన్‌దీప్ సిద్ధూ తెలిపారు. కంపెనీ చెప్పిన మొత్తానికి, దొంగల వాంగ్మూలాలకు తేడా ఉందని చెప్పారు. అయితే దొంగలందరినీ పట్టుకున్నాక ఎంత మొత్తం చోరీ జరిగిందో వెల్లడిస్తామన్నారు. చోరీ చేసిన నగదును దొంగలు దాచేందుకు ప్రయత్నించారని... అనంతరం కొంత నగదు పంపిణీ చేశారన్నారు. ఈ కేసులో మన్‌దీప్ కౌర్, ఆమె భర్త కోసం లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయబడిందన్నారు.
