దత్తాత్రేయతో బీజేపీ నేతల.. లంచ్ మీటింగ్

దత్తాత్రేయతో బీజేపీ నేతల.. లంచ్ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో బీజేపీ నేతల లంచ్ మీటింగ్ జరిగింది. సోమవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​లో బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్​లో ఈ సమావేశం జరిగింది. దీనికి జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, గరికపాటి మోహన్ రావు, బంగారు శృతి,  జనార్దన్ రెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు. ఇందులో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ఓవైపు రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారని ప్రచారం జరుగుతుండడం, మరోవైపు ఢిల్లీలో కేంద్ర కేబినెట్ మీటింగ్ జరుగుతున్న టైమ్​లో.. రాష్ట్ర నేతలు సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. 

రాష్ట్ర అధ్యక్షుడి రేసులో లేను: జితేందర్ రెడ్డి 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో లేనని, పార్టీ ఇచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తానని జితేందర్ రెడ్డి చెప్పారు. లంచ్ మీటింగ్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఈటలతో నాకు విభేదాలు లేవు. ఆయనకు కీలక పదవి ఇస్తే స్వాగతిస్తా. ఈటలతో కలిసి పదేండ్లు తెలంగాణ ఉద్యమంలో పనిచేశా. ఆయన ఆర్థిక మంత్రిగా ఢిల్లీ వచ్చినప్పుడుల్లా నా ఇంట్లోనే ఉండేవారు. హుజూరాబాద్​లో ఈటల గెలుపు కోసం నేను కృషి చేశాను. పార్టీలోఈటలకు అదనపు బాధ్యతలు ఇస్తే బీజేపీ మరింత బలోపేతం అవుతుంది. ఈటల సహా పార్టీ నేతలందరం  కలుసుకుంటూనే ఉంటాం” అని జితేందర్ రెడ్డి తెలిపారు. బీజేపీపై రాహుల్ చేసిన కామెంట్లను ఖండిస్తున్నానన్నారు. 

‘‘2004లో బీఆర్ఎస్​తో బంధుత్వం ఎవరు పెట్టుకున్నరు? రాహుల్ కామెంట్స్​పై రేవంత్ జవాబు చెప్పాలి. కాంగ్రెస్​కు మహబూబ్‌‌నగర్ జిల్లాలో నలుగురు అభ్యర్థులు కూడా లేరు. నిజామాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో అయితే అసలు అభ్యర్థులే లేరు. పొంగులేటి చేరికతో వాపును చూసి కాంగ్రెస్ బలుపు అనుకుంటున్నది’’ అని జితేందర్ రెడ్డి విమర్శించారు.