Maharaja Trophy 2025: మరీ టాలెంటెడ్‌లా ఉన్నాడే: KKR ప్లేయర్ ఫైర్.. తొలి ఓవర్ మొదటి 4 బంతులకు సిక్సర్లు

Maharaja Trophy 2025: మరీ టాలెంటెడ్‌లా ఉన్నాడే: KKR ప్లేయర్ ఫైర్.. తొలి ఓవర్ మొదటి 4 బంతులకు సిక్సర్లు

ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లు కొట్టడం చాలాసార్లు చూసే ఉంటాం. వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టడం అరుదుగా చూస్తాం. ఐదు బంతులకు ఐదు సిక్సర్లు.. ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టినా రాని కిక్ వరుసగా నాలుగు బంతులకు కొడితే వచ్చింది. అసలు విషయం ఏంటంటే కోల్ కతా నైట్ రైడర్స్ ప్లేయర్, యువ క్రికెటర్ లువ్నిత్ సిసోడియా ఇన్నింగ్స్ మొదటి ఓవర్ తొలి నాలుగు బంతులకు సిక్సర్లు కొట్టడం హైలెట్ గా మారింది. మొదటి బంతికి సిక్సర్ కొట్టి ఇన్నింగ్స్ ను ఆరంభిస్తేనే ఆశ్చర్యపోతాం. అలాంటిది లువ్నిత్ సిసోడియా ఇన్నింగ్స్ తొలి నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచి క్రికెట్ లవర్స్ కు సరికొత్త కిక్ అందించాడు.

కర్ణాటకలో ప్రస్తుతం మహారాజా టీ20 లీగ్ లో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. గుల్బర్గా మిస్టిక్స్ తరపున ఆడుతున్న సిసోడియా..  మైసూర్ వారియర్స్ పై ఈ ఫీట్ సాధించాడు. 210 పరుగుల లక్ష్య ఛేదనలో గుల్బర్గా మిస్టిక్స్ బరిలోకి దిగింది. తొలి ఓవర్ స్టార్ స్పిన్నర్ గౌతమ్ కావడంతో పరుగులు రావడం కష్టమని భావించారు. అయితే సిసోడియా మాత్రం తొలి బంతి నుంచే సిక్సర్ల వర్షం కురిపించాడు. తొలి బంతిని లాంగాఫ్ దిశగా సిక్సర్ కొట్టాడు. రెండో బంతిని డీప్ స్క్వేర్ లెగ్ దిశగా.. మూడు, నాలుగు బంతులను డీప్ మిడ్ వికెట్ దిశగా సిక్సర్లు బాదాడు. దీంతో తొలి నాలుగు బంతులకే జట్టు స్కోర్ 24 పరుగులకు చేరింది. 

►ALSO READ | Bronco Test: జిమ్‌లో ఉంటే సరిపోదు మైళ్ళ దూరం పరిగెత్తాల్సిందే.. టీమిండియా ప్లేయర్స్‌కు బ్రోంకో టెస్ట్

ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో సిసోడియా 13 బంతుల్లో 37 పరుగులు చేసి గుల్బర్గా మిస్టిక్స్ కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఐపీఎల్ లో సిసోడియా కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు. 2025 మెగా ఆక్షన్ లో రూ. 30 లక్షల ధరకు కేకేఆర్ ఈ యువ ఆటగాడిని కొనుగోలు చేసింది. దురదృష్టవశాత్తు ఒక్క మ్యాచ్ లో కూడా ఈ కర్ణాటక ప్లేయర్ కు అవకాశం రాలేదు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే  మైసూర్ వారియర్స్ పై  గుల్బర్గా మిస్టిక్స్ 7 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో గుల్బర్గా మిస్టిక్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసి చివరి బంతికి విజయం సాధించింది.