ఈనెల 23న ఎల్వీఎం 3 రాకెట్​ ప్రయోగం

ఈనెల  23న ఎల్వీఎం 3 రాకెట్​ ప్రయోగం

బెంగళూరు: ఉపగ్రహ ప్రయోగాలకు సంబంధించి గ్లోబల్ మార్కెట్ లోకి మన అంతరిక్ష సంస్థ ఇస్రో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటివరకూ పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా విదేశాలకు చెందిన చిన్న చిన్న ఉపగ్రహాలను అంతరిక్షానికి పంపిన ఇస్రో.. ఇకపై ‘లాంచ్ వెహికల్ మార్క్ 3 (ఎల్వీఎం3) ద్వారా భారీ ప్రయోగాలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా తొలిసారిగా ఈ నెల 22న అర్ధరాత్రి దాటిన తర్వాత (23వ తేదీ తెల్లవారుజామున) ఏపీలోని శ్రీహరికోట నుంచి ఎల్వీఎం3 ప్రయోగం చేపట్టనుంది.

బ్రిటన్ కు చెందిన నెట్ వర్క్ యాక్సెస్ అసోసియేట్స్ లిమిటెడ్ (వన్ వెబ్) సంస్థతో ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) ఈ మేరకు రెండు ఒప్పందాలను కుదుర్చుకున్నది. ఇందులో మొదటి ఒప్పందం మేరకు 23న వన్ వెబ్ కు చెందిన 36 బ్రాడ్ బ్యాండ్ శాటిలైట్లను లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇస్రో అధికారులు వెల్లడించారు. గ్లోబల్ కమర్షియల్ లాంచ్ సర్వీసెస్ మార్కెట్లోకి ఇస్రోఎంట్రీకి ఇది మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ ప్రయోగాల కోసం వాడుతున్న జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ నే ఎల్వీఎం3గా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు.