ముస్లింలపై దాడులకు గాడ్సే హిందూత్వనే కారణం

ముస్లింలపై దాడులకు గాడ్సే హిందూత్వనే కారణం

హైదరాబాద్: హిందూ, ముస్లింలు వేర్వేరు కాదని, రెండు సమూహాలు ఒక్కటేనని ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మూకదాడులకు పాల్పడేవారు హిందువులే కాదని.. అలాంటి వారికి ఆవు, గేదెకు మధ్య తేడా తెలిదని భగవత్ చేసిన కామెంట్స్‌కు ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. మూకదాడులకు బీజేపీ ప్రభుత్వం మద్దతుగా ఉంటోందని ఆరోపించారు. దాడులకు పాల్పడిన వారిని కాపాడుతున్నారంటూ కేంద్ర మంత్రులపై ఫైర్ అయ్యారు. 

‘మూకదాడులకు పాల్పడిన వారు హిందువులు కాదని మోహన్ భగవత్ అంటున్నారు. అయితే ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి ఆవు, బర్రెకు మధ్య ఉన్న తేడా ఏంటో తెలియకపోవచ్చు. కానీ జునైద్, అఖ్లాక్, పహ్లూ, రఖ్‌బర్, అలీముద్దీన్ లాంటి వారిని చంపడం మాత్రం తెలుసు. ఇది హిందూత్వం నింపిన విద్వేషమే. ఇలాంటి నేరగాళ్లకు హిందూత్వ సర్కారు అండగా ఉంటోంది’ అని అసదుద్దీన్ విమర్శించారు. పిరికితనం, హింస, హత్యలు చేయడం లాంటివి గాడ్సే హిందూత్వలో విడదీయలేనివిగా మారిపోయాయని.. దీని ఫలితంగా ముస్లింలపై మూకదాడులు పెరిగిపోయాయన్నారు.