కొండాపూర్​లోని భూములను లీగల్​గానే కొన్నాం : ఎం.ప్రభాకర్ రావు

కొండాపూర్​లోని భూములను లీగల్​గానే కొన్నాం :  ఎం.ప్రభాకర్ రావు

హైదరాబాద్, వెలుగు :  కొండాపూర్​లోని 104/1, 104/2, 105,106,107,108 సర్వే నంబర్లలోని భూములను తాము సక్రమంగానే కొనుగోలు చేసినట్లు ఎం. ప్రభాకర్ రావు వెల్లడించారు. ప్రభుత్వానికి చెందాల్సిన భూమిని తాము కొట్టేయ్యలేదన్నారు. వివిధ సర్వే నంబర్లలోని 85.32 ఎకరాల భూమికి వేగే సీతారామయ్య వారసులు వేగే వీరయ్య, వేగే నాగభూషణం, వేగే భాస్కరరావు యాజమానులు కాగా.. ఈ మొత్తం భూమిని మాదాల తిమ్మయ్య  జీపీఏ ద్వారా1998లో భగవాన్​శ్రీ సత్యసాయిబాబా సెంట్రల్ ట్రస్టుకు విక్రయించారని తెలిపారు. అదే భూమిని ట్రస్టు 2000 సంవత్సరంలో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏతో ఆరు రిజిస్టర్డ్​డాక్యుమెంట్ల​ద్వారా భూపతి అసోసియేట్స్​కు అమ్మారన్నారు.

2002లో భూపతి అసోసియేట్స్, బాలసాయి బాబా ట్రస్ట్​ సంయుక్తంగా తనతో సేల్ అగ్రిమెంట్ చేసుకుని 50 ఎకరాలకు ఎంఓయూ రాసుకున్నాయని వివరించారు. ఆ తర్వాత 2005లో మరో 20 ఎకరాలకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిపారు. యూఎల్ సీ కింద రెగ్యులరైజేషన్ కోసం మొత్తం చెల్లింపులు కూడా తన తరపునే చేసినట్లు ప్రభాకర్ రావు పేర్కొన్నారు. అయితే క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసే టైంలో ట్రస్ట్ పేరుతో అప్లై చేసుకోవడంతో వారి పేరు మీద రెగ్యులరైజ్ అవుతున్నట్లు వచ్చిందన్నారు.

దీంతో ట్రస్ట్​కు తప్పుగా నమోదైన ఆ యూఎల్​సీకి బదులు భూపతి అసోసియేట్స్ కు రెగ్యులరైజ్ చేయాలని కోరగా.. ప్రభుత్వం అన్ని రకాలుగా పరిశీలించి 42.03 ఎకరాల భూమిని భూపతి అసోసియేట్స్​కు రెగ్యులరైజ్​చేస్తూ  సవరణ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ మేరకు 2005లో ఇచ్చిన జీవోను సవరిస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారని తెలిపారు. ప్రస్తుతం వేగే సీతారామయ్య వారసులకు ఈ 85.32 ఎకరాల భూములపై ఎలాంటి హక్కు లేదన్నారు. వారంతా1998లోనే రిజిస్టర్డ్ సేల్ డీడ్‌‌‌‌ల ద్వారా భూములను ట్రస్ట్‌‌‌‌కు అమ్మినట్లు స్పష్టం చేశారు.