- రెండు శ్రీగంధం మొక్కలు
నిర్మల్, వెలుగు: తమ ఊరిలో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా వారికి రూ.5 వేలు అందించేందుకు నిర్మల్ గ్రామీణ మండలం అనంత్ పేట సర్పంచ్ మాదస్తు సునీత ముందుకొచ్చారు. ‘మా ఊరి బంగారు తల్లి’ పేరిట ఆమె ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ ఊరిలో ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆ పాప పేరిట బ్యాంకులో రూ.5 వేలు జమ చేయనున్నారు. ప్రతినెలా పిల్లల తల్లిదండ్రులు కూడా ఆ అకౌంట్ లో డబ్బులు జమ చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. దీంతో భవిష్యత్లో ఆడ పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లకు ఆ డబ్బులు పనికొస్తాయని.. తల్లి దండ్రులకు ఆర్థిక భారం కాకుండా ఉంటుందని సర్పంచ్ సునీత చెబుతున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామానికి చెందిన కుంటాల శ్రావణి–రాంచందర్ దంపతుల కూతురు స్మృతి పేరిట రూ.5వేల నగదును బ్యాంకులో డిపాజిట్ చేశారు. రెండు శ్రీగంధం చెట్లను కూడా బహుమతిగా అందించారు. సర్పంచ్ వినూత్న ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు అభినందించారు.

