ఏసీబీకి చిక్కిన మద్దూరు RI.. రైతు నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్

ఏసీబీకి చిక్కిన మద్దూరు RI.. రైతు నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్

మద్దూరు, వెలుగు: భూమిని పాస్‌‌ బుక్‌‌లో చేర్చేందుకు రైతు నుంచి లంచం తీసుకున్న నారాయణపేట జిల్లా మద్దూరు ఆర్‌‌ఐ అమర్‌‌నాథ్‌‌రెడ్డిని ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని అప్పిరెడ్డిపల్లికి చెందిన ఓ రైతుకు గ్రామ సమీపంలోని రేణివట్ల శివారులో ఐదు గుంటల భూమి ఉంది. 

ఆ భూమిని పట్టాదార్‌‌ పాస్‌‌బుక్‌‌లో చేర్చాలని ఇటీవల ఆర్‌‌ఐ అమర్‌‌నాథ్‌‌రెడ్డిని కలువగా.. అతడు రూ. 5 వేలు డిమాండ్‌‌ చేశాడు. తన వద్ద డబ్బులు లేవని రైతు ఎంత వేడుకున్నా ఆర్‌‌ఐ ఒప్పుకోకపోగా.. డబ్బులు ఇస్తేనే పని పూర్తవుతుందని తేల్చి చెప్పాడు.

దీంతో సదరు రైతు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు సోమవారం ఆర్‌‌ఐని కలిసి డబ్బులు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ మహబూబ్‌‌నగర్‌‌ డీఎస్పీ బాలకృష్ణ, ఇన్స్‌‌పెక్టర్లు లింగ స్వామి, జిలాని ఆర్‌‌ఐ అమర్‌‌నాథ్‌‌రెడ్డిని రెడ్‌‌హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. అతడిని హైదరాబాద్‌‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు వారు తెలిపారు.