మియాపూర్ లో ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడిన ఘటనలో 21 మంది అరెస్టు చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. 2024, జూన్ 23వ తేదీన మియాపూర్ పోలీస్ స్టేషన్ లో మాదాపూర్ డీసీపీ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 100,101 సర్వే నంబర్ లో 415 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చెప్పారు.ఈ భూమిని కొందరు కబ్జా దారులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 2500 మందికి ప్రభుత్వ భూమిని ఇప్పిస్తామని సామాన్య ప్రజలను రెచ్చగొట్టారు. హెచ్ఎండీఏ, రెవెన్యూ, పోలీసులు.. కబ్జాకు వచ్చిన వారితో చర్చలు జరిపుతున్న క్రమంలో దాడికి పాల్పడ్డారని చెప్పారు.
ఈ దాడిలో హెచ్ఎండీఏ సైట్ ఆఫీసర్ కు తీవ్ర గాయాలు అయ్యాయని డీసీపీ తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై 307తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు. 50 మందిని గుర్తించామని..ఇందులో 21 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని ఆయన చెప్పారు. 21 మందిలో 7గురు మహిళలు కూడా ఉన్నారని తెలిపారు. మియాపూర్ ఘటన పరిసర ప్రాంతాల్లో జూన్ 29వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. తేర వేనుక ఉండి సామాన్య ప్రజలను రెచ్చగొట్టే వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు డీసీపీ వినీత్ చెప్పారు.
