లిక్కర్ స్కాంలో దొరికిన కవితను చేర్చుకునే దుస్థితిలో కాంగ్రెస్ లేదు : మధు యాష్కీ గౌడ్

లిక్కర్ స్కాంలో దొరికిన కవితను చేర్చుకునే దుస్థితిలో కాంగ్రెస్ లేదు : మధు యాష్కీ గౌడ్
  • ఇన్నేండ్లు దోచుకున్న డబ్బును ఇప్పుడు ఖర్చు చేస్తున్నది: మధు యాష్కీ గౌడ్

హైదరాబాద్, వెలుగు: లిక్కర్ స్కాంలో దొరికిన కల్వకుంట్ల కవితను పార్టీలో చేర్చుకునే దుస్థితికి కాంగ్రెస్ చేరలేదని మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ అన్నారు. కవిత తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అడ్డగోలుగా సంపాదించారని, ఆ డబ్బును ఇప్పుడు ఖర్చు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. 

ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు ప్రాణత్యాగం చేసుకుంటున్న సమయంలో కేటీఆర్, కవిత, హరీశ్ అమెరికాలో కంపెనీలు పెట్టారని పేర్కొన్నారు. కొందరు పోలీసు అధికారులు మీడియాలో ప్రముఖంగా కనిపించేందుకు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మధు యాష్కీ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో పనిచేసినట్టు కాంగ్రెస్​ ప్రభుత్వంలో చేస్తానంటే కుదరదని, ఇక్కడ ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి అని స్పష్టం చేశారు.

 సిటీ పోలీస్ కమిషనర్ అమాయకుల మీద ప్రతాపం చూపిస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వం ప్రజల్లో బద్నాం అవుతోందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంతో ఆయా నియోజకవర్గాల్లో సమన్వయ లోపం ఉందన్నారు. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమిటీ వేయాలని సూచించారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరామంటూ తమ పార్టీని బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటే కుదరదని.. కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్న సీనియర్లను సమన్వయం చేసుకుంటూ వలస ఎమ్మెల్యేలు ముందుకు పోవాలని సూచించారు. సీఎం, మంత్రుల మధ్య పూర్తి సమన్వయం ఉందని మధు యాష్కీ అన్నారు.