ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకం కావాలి : మధుయాష్కీ గౌడ్

ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకం కావాలి : మధుయాష్కీ గౌడ్
  • బీజేపీ కుట్రను తిప్పి కొట్టాలి
  • రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి: చంద్రశేఖర్​
  • కుల గణన ఆధారంగా రిజర్వేషన్లు: మహేశ్ కుమార్ గౌడ్
  • కాంగ్రెస్​తోనే పేదలకు న్యాయం: బల్మూరి వెంకట్
  • గాంధీభవన్​లో ‘రాజ్యాంగ పరిరక్షణ దీక్ష’ ముగింపు

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లపై బీజేపీ కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. శనివారం పీసీసీ దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్​లో ‘‘రాజ్యాంగ పరిరక్షణ దీక్ష’’ చేపట్టారు. ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ దీక్షకు హాజరై మాట్లాడారు. ‘‘స్కాలర్​షిప్ రద్దు చేయడం, కుల వివక్ష కారణంగానే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నడు. 

అలాంటప్పుడు రోహిత్ దళితుడే కాదని పోలీసులు కుల సర్టిఫికెట్ ఎట్ల ఇస్తరు? ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాకే పోలీసులు ఈ కేసును క్లోజ్ చేశారు. బీజేపీ నేతలు దళితులను మోసం చేస్తున్నరు. శ్రీకాంతా చారి తల్లిని కేసీఆర్ అవమానించారు’’అని మధుయాష్కి అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ అన్నారు. ‘‘కేసీఆర్ రాజ్యాంగాన్ని మారుస్తా అన్నడు. 

బీజేపీ నేతలు కూడా అదే అంటున్నరు. పేద ప్రజలు చదువుకునే పాఠశాలలను కేసీఆర్ మూసివేయించాడు. బీజేపీకి తోక పార్టీగా బీఆర్ఎస్ ఉన్నది. బీజేపీకి 400 సీట్ల లక్ష్యం వెనుక రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర దాగి ఉన్నది. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మొత్తాన్ని మార్చేస్తరు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని ఓడించాలి’’అని పేర్కొన్నారు.

ఇంకా దేశంలో అసమానతలు తొలగిపోలేదు

కుల గణన చేస్తామని రాహుల్ గాంధీ బహిరంగంగా ప్రకటించారని, బీజేపీ ఎందుకు దీనిపై ప్రకటన చేయడం లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ‘‘కులగణన ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని రాహుల్ చెప్పారు. దేశంలో ఇంకా అసమానతలు పూర్తిగా తొలగిపోలేదు. అసమానతలు పోవాలంటే ఇంకా రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే కాంగ్రెస్​కు అధికారం కట్టబెట్టాలి’’అని అన్నారు. బీజేపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు.

 కాంగ్రెస్​తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. మోదీకి రేవంత్ భయం పట్టుకుందన్నారు. మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే బీజేపీకి ఓటర్లు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ ఎస్సీ సెల్ విభాగం చైర్మన్ ప్రీతం అన్నారు. రాజ్యాంగం జోలికి వెళ్తే బట్టలిప్పి కొడ్తామని వార్నింగ్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లను తొలగించేందుకు మోదీ సర్కార్ కుట్ర చేస్తున్నదని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు.

 మందకృష్ణ మాదిగ బీజేపీ నాయకుడని, రిజర్వేషన్లు ఎత్తేసినా ఆయనకు అభ్యంతరం లేదన్నారు. ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం దీక్ష చేస్తుంటే.. తాము మాత్రం రిజర్వేషన్లను కాపాడుకునేందుకు దీక్ష చేస్తున్నామన్నారు. ఈ దీక్ష చేస్తున్న నేతలకు కాంగ్రెస్ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు తిలోథియా నిమ్మరం ఇచ్చి విరమింపజేయించారు. ఈ దీక్షలో దళిత కాంగ్రెస్ నాయకులు సతీశ్ మాదిగ, ఊట్ల వర ప్రసాద్, మానవతా రాయ్, రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.