కవిత విడుదల కోసం బీఆర్ఎస్ ను బీజేపీలో కలుపుతున్నరు : మధు యాష్కీ

కవిత విడుదల కోసం బీఆర్ఎస్ ను బీజేపీలో కలుపుతున్నరు  :  మధు యాష్కీ
  • కేసీఆర్ ​సూచనలతో కేటీఆర్, హరీశ్​ ఢిల్లీలో చర్చలు
  •  విలీనంపై కేంద్ర మంత్రుల మధ్య విభేదాలు
  •  కిషన్​రెడ్డి ఓకే చెప్పినా.. ససేమిరా అంటున్న బండి  
  •  హరీశ్​ను లాగి బీఆర్ఎస్​ను చీల్చే పనిలో సంజయ్​
  •  అందుకే హరీశ్​ను తెగ పొగుడుతున్నడని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : కవితను జైలు నుంచి విడిపించేందుకు బీఆర్ఎస్​ను బీజేపీలో విలీనం చేస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ అన్నారు. కేసీఆర్​ సూచనల మేరకు కేటీఆర్, హరీశ్​రావు  ఢిల్లీలో చర్చలు జరిపారని ఆయన పేర్కొన్నారు. అయితే, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని.

విలీనానికి కిషన్ రెడ్డి ఓకే చెప్పినా, బండి సంజయ్ మాత్రం హరీశ్​రావును బీజేపీలోకి లాగి, బీఆర్ఎస్ ను చీల్చే పనిలో ఉన్నారని ఆయన చెప్పారు. అందుకే హరీశ్​రావును బండి సంజయ్ తెగ పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం గాంధీ భవన్ లో మధుయాష్కీ మీడియాతో చిట్ చాట్ చేశారు.  

పీసీసీ చీఫ్​పదవిపై చర్చించలే..

ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల వద్ద మంత్రివర్గ విస్తరణపై చర్చ జరిగిందని మధుయాష్కీ తెలిపారు. దాంతో పాటు ఎవరెవరికి ఏయే శాఖలు ఇవ్వాలనేదానిపై కూడా చర్చ సాగిందన్నారు. పీసీసీ చీఫ్ పోస్టుపై కేవలం 5 నిమిషాలు చర్చించి పక్కన పెట్టారన్నారు. పీసీసీ చీఫ్ విషయంలో రేవంత్ ఎవరి పేరునూ హైకమాండ్ కు సిఫారసు చేయలేదని తెలిపారు. మహేశ్ కుమార్ గౌడ్ కు రేవంత్ సపోర్టు చేస్తున్నారనేది కేవలం మీడియా సృష్టి మాత్రమేనన్నారు. పీసీసీ చీఫ్ పదవి ఇస్తే తీసుకుంటానని, వేరే ఏ పదవీ తీసుకోనని ఆయన చెప్పారు.

లోక్ సభలో రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ఉండమని చెప్పిందే సీఎం రేవంత్ రెడ్డి అని, ఆ తర్వాత కర్నాటక సీఎం సిద్ధరామయ్య కూడా చెప్పారన్నారు. కార్పొరేషన్ చైర్మన్ ల నియామకంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ దీపాదాస్ మున్షీ పాత్ర ఏమి లేదని.. వాటిపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు మాత్రమే చర్చించి ఫైనల్ చేశారన్నారు. గత ప్రభుత్వంలో పని చేసిన కొందరు అధికారులు తమను కేసుల నుంచి తప్పించాలని ప్రభుత్వంలోని కొందరు పెద్దల చుట్టు తిరుగుతున్నారని ఆయన చెప్పారు. అందుకు ప్రతిఫలంగా వందల కోట్లు ఇస్తామని తిరుగుతున్నారని తెలిపారు. 

నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో కేటీఆర్, హరీశ్, కవితకు వాటాలు 

నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల్లో కేటీఆర్, హరీశ్,  కవితకు 15 శాతం వాటాలు ఉన్నాయని మధుయాష్కీ ఆరోపించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలతో పాటు, కవితకు చెందిన వెలాసిటీ కాలేజీలో విద్యార్థుల దొంగ జాబితాతో వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్​ను కొల్లగొట్టారని ఆయన చెప్పారు. ‘నోటిఫికేషన్లు వేసి పరీక్షలు వాయిదావేస్తే.. కోచింగ్​సెంటర్లకు లాభం. వాటి నిర్వాహకులు వంద కోట్లు లబ్ధిపొందుతారు. జాబ్ కోరుకునే వాళ్లు పరీక్షల వాయిదా కోరుకోరు”అని ఆయన పేర్కొన్నారు.

ఏఐసీసీ డైరెక్షన్ లోనే చేరికలు

ఏఐసీసీ డైరెక్షన్ లోనే చేరికలు జరుగుతున్నాయని మధుయాష్కీ తెలిపారు. ప్రజాపాలనలో సీఎంను ఎవరైనా కలవొచ్చని.. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి  వస్తున్నారన్నారు. పదవులు, ప్యాకేజీల ఆశ చూపి కేసీఆర్ ఆనాడు ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని.. కానీ, కాంగ్రెస్ లో చేరే వారికి ఎలాంటి పదవులు, ప్యాకేజీల హామీలు ఇవ్వడం లేదన్నారు. బీజేపీ మాత్రం పలు రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను చేర్చుకొని, వారికి మంత్రి పదవులు ఇచ్చిందన్నారు. నియంతృత్వ పాలనతోనే కేసీఆర్ ఓడిపోయారని మధుయాష్కీ విమర్శించారు.

అధికారం చేజిక్కించుకునేందుకే  తెలంగాణ ఉద్యమంలో చొరబడి తానే ఉద్యమం చేసినట్టు కలరింగ్ ఇచ్చిండని ధ్వజమెత్తారు. కేసీఆర్ దళిత వ్యతిరేకి అని, ప్రతిపక్ష నేతగా భట్టి  ఉన్నప్పుడు సభలో కేసీఆర్ ను నిలదీస్తే తట్టుకోలేకపోయిండని అన్నారు. అది జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ లోని 12 మందిని చీల్చి విలీనం చేసుకొని భట్టికి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కూడాసామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి సీఎం కావడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నాడని మధు యాష్కీ ఆరోపించారు.