
షాంఘై: ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–2లో ఇండియా విలుకాండ్ల గురి అదిరింది. యంగ్ ఆర్చర్ మధుర ధమన్‌గోంకర్ తొలి గోల్డ్ మెడల్‌తో మెరవగా, కాంపౌండ్ సెక్షన్‌లో ఇండియా మొత్తం ఐదు పతకాల (2 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలు)ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన విమెన్స్ వ్యక్తిగత కాంపౌండ్ ఫైనల్లో మధుర 139–138తో కార్సన్ క్రహే (అమెరికా)పై గెలిచి బంగారు పతకాన్ని సాధించింది. తొలి రౌండ్‌లో 30 పాయింట్లు సాధించిన మధుర రెండు, మూడో రౌండ్‌లో నిరాశపర్చింది. దీంతో 81–85తో వెనకబడింది. మూడో రౌండ్‌లో క్రహే 30 పాయింట్లు సాధించింది.
నాలుగో రౌండ్‌లోనూ మధుర 29 పాయింట్లకే పరిమితమైనా ఓవరాల్‌గా ఇద్దరు ఆర్చర్లు 110–110తో నిలిచారు. నిర్ణయాత్మక ఆఖరి రౌండ్‌లో మధుర 29 పాయింట్ల సాధించగా, క్రహే28తో సరిపెట్టుకుంది. దీంతో ఒక్క పాయింట్ తేడాతో మధుర గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది. మెన్స్ టీమ్ ఫైనల్లో అభిషేక్ వర్మ–ఓజాస్ డియోటలే–రిషబ్ యాదవ్‌తో కూడిన ఇండియా 232–228తో మెక్సికోపై నెగ్గి స్వర్ణం ఖాతాలో వేసుకుంది. విమెన్స్ టీమ్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి తానిపర్తి చికిత, మధుర–జ్యోతి సురేఖ వెన్నం–బృందం 221–234తో మెక్సికో చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడిన అమ్మాయిలు ఆఖరి మెట్టుపై మాత్రం కాస్త కంగారుపడ్డారు. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ప్లే ఆఫ్స్‌లో మధుర–అభిషేక్ వర్మ 144–142తో మలేసియాను ఓడించి కాంస్యం సాధించింది. ఓవరాల్‌గా మధుర గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ సాధించింది.