
హైదరాబాద్, వెలుగు: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ మధుసూదనాచారిని ప్రభుత్వం నామినేట్ చేసింది. గురువారం రాష్ట్ర కేబినెట్ ఈ ప్రపోజల్ పంపగా, శుక్రవారం గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపినట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఉత్తర్వులు శనివారం వెలువడుతాయని పేర్కొన్నాయి. మొదట గవర్నర్ కోటాలో హుజూరాబాద్‌కు చెందిన పాడి కౌశిక్ రెడ్డిని నామినేట్ చేస్తూ ఆగస్టులో కేబినెట్ తీర్మానం చేసింది. దాన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపగా.. కౌశిక్‌పై పలు కేసులు పెండింగ్‌లో ఉండడంతో తమిళిసై పెండింగ్‌లో పెట్టారు. దీంతో కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్యే కోటాకు మార్చిన రాష్ట్ర సర్కార్.. ఈ నెల 16న ఆయనతో నామినేషన్ వేయించింది. ఆయన స్థానంలో మధుసూదనాచారిని ఖరారు చేసి, సర్క్యులేషన్ పద్ధతిలో గవర్నర్ కు ప్రపోజల్ పంపింది. కాగా, రాష్ట్ర తొలి అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన మధుసూదనాచారి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన సీఎం కేసీఆర్... మండలి చైర్మన్ పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పదవికి మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.