
- ఐదేండ్లు అధికారంలో ఉండేది కాంగ్రెస్ సర్కారే
- మంత్రి వర్గ విస్తరణ సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం
- మీడియాతో చిట్‌చాట్‌లో పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్
హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా 15 స్థానాల్లో గెలుస్తామని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. తాను ఎంపీగా పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. కొందరు లీడర్లు తనను కావాలనే ఎల్బీ నగర్లో ఓడించారని చెప్పారు. ఐదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఎన్నికల నాటికి ఎల్బీ నగర్లో 30 వేల కొత్త ఓట్లు యాడ్ అయ్యాయని, అవన్నీ ఫేక్ ఓట్లేనని ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం, అధికారులు కావాలనే ఫేక్ ఓట్లను సృష్టించారన్నారు. గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ముస్లింలు, సెటిలర్ల ఓట్లు బీఆర్ఎస్కే పడ్డాయని చెప్పారు. కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుందని రియల్టర్లను బీఆర్ఎస్ భయపెట్టిందన్నారు.
కాంగ్రెస్‌లోకి వస్తామంటున్నరు..
మంత్రి వర్గ విస్తరణ సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమని, ఆయనదే తుది నిర్ణయమని మధు యాష్కీ అన్నారు. ఈ విషయంలో హైకమాండ్ జోక్యం చేసుకోదని తెలిపారు. ప్రతిపక్షాల్లోని చాలా మంది లీడర్లు, సిట్టింగులు కాంగ్రెస్‌లోకి వస్తామంటున్నారని చెప్పారు. అయితే, పార్టీ కేడర్ మనోస్థైర్యం దెబ్బతింటుందన్న ఉద్దేశంతో వారిని వద్దంటున్నామని తెలిపారు. సుధీర్ రెడ్డి పార్టీ జంప్ కావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వారి ఆస్తులను కాపాడుకోవడమే ముఖ్యమని, అందుకు ఏ పార్టీలోకైనా ఆయన జంప్ అవుతారని చెప్పారు. పీసీసీ చీఫ్‌గా రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓ మంత్రి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బీసీలకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తారనడం ఊహాజనితమేనన్నారు.
ఎంఐఎం లేకుంటే కిషన్ రెడ్డి గెల్వడు
సికింద్రాబాద్‌లో గెలిచేందుకు కిషన్ రెడ్డి పొద్దున లేస్తే జై అసద్ భాయ్ అంటున్నారని మధు యాష్కీ విమర్శించారు. ఎంఐఎం లేకుంటే కిషన్ రెడ్డి గెలవరన్నారు. బీజేపీ చీఫ్ ను మార్చే అవకాశముందని, ఓ కేంద్ర మంత్రి స్వయంగా తనకు చెప్పారని తెలిపారు. తెలుగు సినిమా ఆస్కార్ స్టేజ్ వరకు వెళ్లినా ప్రపంచ సినీ ఎరీనాలో హైదరాబాద్ పిక్చర్‌లోనే లేదన్నారు. ఒకప్పుడు ఎంతో ఘనంగా హైదరాబాద్ ఫిలిం ఫెస్టివల్ జరిగేదని, ఇప్పుడు పూర్తిగా డెడ్ అయిందని అన్నారు.