కాంగ్రెస్పై టీఆర్ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయి

కాంగ్రెస్పై టీఆర్ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయి

టీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ భయం పట్టుకుందని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ బలపడుతుందని గ్రహించి టీఆర్ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికను ఈ రెండు పార్టీలే తీసుకొచ్చాయని చెప్పారు. ఎన్నికల కమిషన్ పనులన్నీ ..ఈ రెండు పార్టీలు చేస్తున్నాయని చురకలంటించారు. విద్యుత్ సంస్కరణలపై వ్యతిరేకంగా మాట్లాడిన టీఆరెస్.. పార్లమెంట్ లో  బిల్లు ప్రవేశపెట్టే సమయంలో టీఆరెస్ ఎంపీలు ఎందుకు లేరని ప్రశ్నించారు. 

మునుగోడు బైపోల్పై గాంధీభవన్లో ఎన్నికల ప్రణాళిక కమిటీ సమావేశం అయ్యినట్లు మధుయాష్కీగౌడ్ తెలిపారు. పీసీసీ అనుబంధ సంఘాల చైర్మన్లు ఈ సమావేశానికి హాజరైనట్లు వెల్లడించారు. మునుగోడు ఉపఎన్నికపై చర్చించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మునుగోడులో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్న అభిప్రాయానికి వచ్చినట్లు మధుయాష్కీగౌడ్ తెలిపారు. మునుగోడులో కాంగ్రెస్ ఓటును కాపాడుకుంటే గెలుపు సులువు అవుతుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తారని వెల్లడించారు. మండల స్థాయిలో కూడా సమావేశాలు ఉంటాయన్నారు. 

బుధవారం రాత్రి  కాంగ్రెస్‌ ముఖ్యనేతలు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మాణిక్కం ఠాగూర్, రేవంత్‌రెడ్డి, బోసురాజు, నదీమ్‌ జావేద్, సునీల్‌ కనుగోలు అర్ధరాత్రి వరకు సుదీర్ఘ చర్చలు జరిపారు.  ఉపఎన్నికపై ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ సర్వే వివరాలను అందించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ప్రధానంగా మునుగోడు ఉపఎన్నికకు అభ్యర్థి ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహం, ఆశావహుల నేపథ్యం, ప్రత్యర్థులు బలాబలాలు వంటి అంశాలపై చర్చించినట్లు  సమాచారం