అక్రమంగా కట్టిన రేప్ కేసు నిందితుడి ఇల్లు కూల్చివేత

అక్రమంగా కట్టిన రేప్ కేసు నిందితుడి ఇల్లు కూల్చివేత

గ్వాలియర్: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బాగా పాపులర్‌‌ అయిన ‘బుల్డోజర్’ ట్రెండ్.. ఇప్పుడు ఆ పొరుగునే ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటరైంది. అక్రమాలు, గుండాగిరీలు చేస్తే సహించేది లేదని, మారిపోతారా? రాష్ట్రం వదిలి పారిపోతారా? లేదంటే బుల్డోజర్ రావాలా? అంటూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వార్నింగ్ ఇచ్చారు. ఓ రేప్ కేసు నిందితుడు అక్రమంగా కట్టిన ఇంటిని అధికారులు బుల్డోజర్‌‌తో కూలగొట్టిన విషయాన్ని ట్వీట్టర్ ద్వారా షేర్‌‌ చేస్తూ ఆయన పై హెచ్చరిక చేశారు.

ఇదీ ఘటన..!

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌‌లో సుభాష్ నగర్ బహోడాపుర్‌‌ ఏరియాకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు చతుర్భుజ్ రాథోడ్‌.. చాక్‌లెట్లు ఆశ చూపి 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ చిన్నారి పేరెంట్స్ పోలీసులకు  కంప్లైంట్‌ ఇవ్వగా.. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. నిందితుడు ఎటుంటి పర్మిషన్లు లేకుండా అక్రమంగా కట్టిన ఇంట్లో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. దీంతో జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. ఆ ఇంట్లో వారిని ఖాళీ చేయించి దానిని బుల్డోజర్‌‌తో కూలగొట్టారు. ఆ ఇల్లు అక్రమంగా కట్టడంతోనే కూల్చేశామని అధికారులు తెలిపారు.

కూల్చివేత వీడియో ట్వీట్ చేసిన కలెక్టర్.. సీఎం రీ ట్వీట్

సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించిన యాంటీ మాఫియా క్యాంపెయిన్‌లో భాగంగా రేప్ కేసు నిందితుడు అక్రమంగా కట్టిన ఇంటిని బుల్డోజర్‌‌తో కూల్చేశామని గ్వాలియర్ జిల్లా కలెక్టర్ ట్వీట్ చేశారు. ఇంటిని కూల్చివేస్తున్న వీడియోను ఆయన ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అమానవీయమైన రేప్ ఘటనను సమాజాన్ని కలచివేసిందని కలెక్టర్ అన్నారు. దీనిని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రీట్వీట్ చేశారు. ‘‘మధ్యప్రదేశ్ గడ్డపై గూండాలు, దుర్మార్గులు, మాఫియాలకు చోటు లేదు. ఒకటి రాష్ట్రం విడిచి వెళ్లిపోండి లేదా ఇక్కడే ఉండాలంటే మంచిగా మారండి. మరో మార్గం లేదు. అలా కాదంటే బుల్డోజర్ దూసుకొచ్చేస్తది” అంటూ శివరాజ్ సింగ్ ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తల కోసం..

శ్రీశైలం షాప్‌లకు నిప్పుపెట్టిన కన్నడ భక్తులు

రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్

పెట్రోల్ రేట్లపై జర్నలిస్ట్ ప్రశ్న.. రాందేవ్ గుస్సా