వరదల్లో చిక్కుకున్న హోంమంత్రి.. కాపాడిన ఆర్మీ

వరదల్లో చిక్కుకున్న హోంమంత్రి.. కాపాడిన ఆర్మీ

మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో రాష్ట్రంలో చాలా ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో పర్యటించడానికి వెళ్లిన ఓ మంత్రి కూడా వరదల్లో చిక్కుకున్నారు. ఈ ఊహించని ఘటన దాటియా జిల్లాలో జరిగింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను నేరుగా కలుసుకునేందుకు హోంమంత్రి నరోత్తం మిశ్రా తన సిబ్బందితో కలిసి వెళ్లారు. అయితే వీరు వెళ్తున్న పడవ మీద చెట్ట విరిగిపడటంతో.. పడవ దెబ్బతింది. ఆ తర్వాత పడవ ఇంజిన్ కూడా స్టార్ట్ కాలేదు. దాంతో మిశ్రా వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. అప్రమత్తమైన అధికారులు.. భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్‌తో అక్కడికి వెళ్లారు. అప్పటికే మంత్రి సహా తన సిబ్బంది మొత్తం పూర్తిగా మునిగిన ఇంటి డాబా మీదకు చేరుకున్నారు. మిశ్రా ఎక్కడున్నారో కనిపెట్టిన ఐఏఎఫ్ సిబ్బంది మిశ్రా సహా ఆయన సిబ్బందిని హెలికాప్టర్ నుంచి తాడును వదిలి పైకి లాగారు.

వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు మరియు సహాయక శిబిరాలను పర్యవేక్షించడానికి మంత్రి నరోత్తమ్ దాటియా జిల్లాలోని అనేక వరద ప్రభావిత గ్రామాలను సందర్శించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కొన్ని వరద ప్రభావిత ప్రాంతాలను సర్వే చేశారు. వరదల కారణంగా దాటియా జిల్లాలోని రెండు వంతెనలు కూలిపోయాయి. అంతేకాకుండా.. మూడో నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న వంతెన మీద పగుళ్లు ఏర్పడ్డాయి. దాంతో ఆ వంతెనను ముందుజాగ్రత్తగా మూసివేశారు.

కాగా.. ఈ ఘటనను రాష్ట్ర కాంగ్రెస్ విమర్శించింది. పబ్లిసిటీ కోసం మిశ్రా చేసిన స్టంట్ తలకిందులైందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ‘స్పైడర్ మ్యాన్‌లాగా షో చేయడానికి మా హోంమంత్రి ప్రయత్నించిన విధానం ఆయనకు మరియు ఆయనతో పాటు ఉన్న సిబ్బందికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. ఇది ఆయన ఊహించి ఉండరు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే’ అని కాంగ్రెస్ నాయకుడు భూపేంద్ర గుప్తా అన్నారు.