దొంగ‌కి క‌రోనా పాజిటివ్: చికిత్స కోసం జైలు నుంచి ఆస్ప‌త్రికి.. అక్క‌డ జంప్‌

దొంగ‌కి క‌రోనా పాజిటివ్: చికిత్స కోసం జైలు నుంచి ఆస్ప‌త్రికి.. అక్క‌డ జంప్‌

దొంగత‌నం కేసులో సెంట్ర‌ల్ జైలులో ప‌డ్డాడు. తీరా అక్క‌డ క‌రోనా వైర‌స్ సోకింద‌ని తెలియ‌డంతో పోలీసులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స అందించాక కోలుకుంటే మ‌ళ్లీ జైలుకి త‌ర‌లించాల‌నుకున్న పోలీసుల‌కు ఈ ఘ‌రానా దొంగ షాక్ ఇచ్చారు. క‌రోనా పాజిటివ్ అని తెలిసి కూడా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఆస్ప‌త్రి నుంచి ప‌రార‌య్యాడు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గ్వాలియ‌ర్‌లో జ‌రిగింది.

ఇద్ద‌రు పోలీసుల స‌స్పెన్ష‌న్.. జ‌నాల్లో టెన్ష‌న్

ఒక దొంగ‌త‌నం కేసులో నిందితుడిగా గ్వాలియ‌ర్ సెంట్ర‌ల్ జైలులో ఉన్న వ్య‌క్తికి కరోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో జైలు అధికారులు టెస్ట్ చేయించారు. అత‌డికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ట్రీట్మెంట్ కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా.. అక్క‌డ పోలీసుల క‌ళ్ల‌గ‌ప్పి ప‌రార‌య్యాడు. అయితే అత‌డికి క‌రోనా సోకిన నేప‌థ్యంలో బ‌య‌ట తిరిగితే మ‌రికొంద‌రు వైర‌స్ బారిన‌ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని స్థానికులు టెన్ష‌న్ ప‌డుతున్నారు. వీలైనంత త‌ర్వ‌గా అత‌డిని గుర్తించి ప‌ట్టుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. మ‌రోవైపు ఆస్ప‌త్రికి తీసుకెళ్లి అక్క‌డ డ్యూటీలో ఉన్న ఇద్ద‌రు పోలీసుల‌ను నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని స‌స్పెండ్ చేసిన‌ట్లు తెలిపారు ఎస్పీ మ‌నోజ్ సాహూ. అత‌డి కోసం గాలింపు చేప‌డుతున్నామ‌ని, వీలైనంత త్వ‌ర‌గా ప‌ట్టుకుంటామ‌ని చెప్పారు.