ఆధ్యాత్మికం: మాఘ పౌర్ణమి రోజు. దేవతలు నివసించే ప్రదేశం ఇదే..!

ఆధ్యాత్మికం:  మాఘ పౌర్ణమి రోజు. దేవతలు నివసించే ప్రదేశం ఇదే..!

తెలుగు నెలల్లో మాఘ మాసం కొనసాగుతుంది.   మాఘ పౌర్ణమి తిథి రోజున ఆధ్యాత్మికంగా చాలా విశిష్టత ఉందని స్కంద పురాణం ద్వారా తెలుస్తుంది.   మాఘ పౌర్ణమి రోజున.. పుణ్య తీర్థాలు.. నదీ తీరాలు  జనాలతో కళకళలాడుతాయి.   ఆ రోజు దేవతలు నదీ జలాల్లో ఉంటారని పండితులు చెబుతున్నారు.  ఏడాది మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 1 వ తేది వచ్చింది.  ఆరోజు నదీ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత.. ఆరోజు పుణ్య తీర్థాల్లో స్నానం చేయడం వలన కలిగే ఉపయోగాలేమిటి.. ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

పుణ్య నదుల్లో ఏడాదంతా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది.  పురాణాల ప్రకారం మాఘమాసం ఎంతో విశిష్టమైనది.  ఇక మాఘ పౌర్ణమి రోజున నదులు, గుడిలోని కోనేరులు కూడా ఈ రోజున  (2026  ఫిబ్రవరి 1)  పవిత్రతను సంతరించుకుంటాయని నమ్మకం.  ఈ నెలలో పుణ్యనదుల్లో సకల దేవతలు సంచరిస్తుంటారని పండితులు చెబుతున్నారు. 

నదీజలాల్లో దేవతలు .. మాఘ మాసంలో  సర్వశక్తులు.. తేజస్సులను ఉంచుతారు. అందువలన మాఘ పౌర్ణమి రోజున  నదీ స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు.  అలా అవకాశం లేనివారు బావుల దగ్గర కాని.. చెరువుల దగ్గర కాని.. కుళాయిల దగ్గర కాని స్నానం చేసినా అలాంటి ఫలితమే దక్కుతుందని పండితులు చెబుతున్నారు. 

మాఘమాసంలో పుణ్య నదుల్లో స్నానం చేస్తే ఆరేళ్ల పాటు మంత్ర సంకల్ప స్నాన ఫలం లభిస్తుందని శాస్తాల ద్వారా తెలుస్తుంది.  నదీ స్నానానికి వెళ్లలేని వారు బావి దగ్గర కాని.. బోరు దగ్గర కాని.. వాటర్ ట్యాంక్ ల దగ్గర గాని  నదుల పేర్లు చెప్పుకుంటూ స్నానం చేయాలి. మాఘస్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుంది. 

స్నానం చేసిన తరువాత ఏంచేయాలంటే..

స్నానం చేసిన తరువాత  సూర్యభగవానుడికి అర్ఘ్యం ( దోసెళ్లతో నీటిని సూర్యభగవానుడికి చూపించి ఒక పళ్లెంలో విడవవలెను)   సమర్పించాలి. వైష్ణవ ఆలయానికి గానీ, శివాలయానికి గానీ వెళ్లి దర్శనం చేసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా శక్తిమేరకు దానధర్మాలు చేయాలి.  దీని వల్ల జన్మజన్మలుగా వెంటాడుతున్న పాపాలు, దోషాలు నశిస్తాయని నమ్మకం.

శంఖు రూపంలో పార్వతీ దేవి.. 

మాఘపౌర్ణమి రోజున పార్వతితేవి  భూమి మీద ఒక శంఖు రూపంలో పడి... దక్షప్రజాపతి చేయి సోకగానే బాలికగా మారిపోయిందని పండితులు చెబుతున్నారు. ఆ బాలికకు సతీదేవి అన్నపేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు దక్షుడు. 

మాఘ పౌర్ణమి విశిష్టత

 మునులలో అతి ప్రసిద్ధుడైన కపిల మహర్షి జన్మించింది కూడా మాఘ పౌర్ణమి రోజే. కేవలం మనకు మాత్రమే కాకుండా బౌద్ధులకు కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమే..  బుద్ధుడు తాను త్వరలోనే నిర్యాణం చెందబోతున్నట్లుగా ఈ రోజునే ప్రకటించారట.    అందుకని మాఘపౌర్ణమి రోజున  బౌద్ధులు  వారి మతగ్రంథాలైన త్రిపిటకాలను పారాయణ చేస్తుంటారు.