తెలుగు వర్సిటీలో మహాభారతం, నన్నయ సహస్రాబ్ది ఉత్సవాలు

తెలుగు వర్సిటీలో మహాభారతం, నన్నయ సహస్రాబ్ది ఉత్సవాలు
  • హర్యానా గవర్నర్ దత్తాత్రేయ

హైదరాబాద్, వెలుగు: మహాభారతం గొప్ప కావ్యమని, దాన్ని స్టూడెంట్లకు అందించేందుకు కృషి చేయాలని తెలుగు రాష్ట్రాల సీఎంలకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. శనివారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో కేంద్ర సాస్కృతిక శాఖ, రాశి కేర్స్ సంస్థ ఆధ్వర్యంలో మహాభారత అవతరణ సహస్రాబ్ది, ఆదికవి నన్నయ సహస్రాబ్ది మహోత్సవాలు నిర్వహించారు. చీఫ్​గెస్టుగా హాజరైన  దత్తాత్రేయ మాట్లాడుతూ.. మహాభారతం, ఇతర మహాకావ్యాలను స్టూడెంట్లకు అందించేలా చొరవ చూపాలని ఏపీ, తెలంగాణ సీఎంలను కోరారు.
తెలుగు భాష మూలాలను దృష్టిలో ఉంచుకుని నన్నయ మహాభారత రచన చేశారన్నారు. ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు మాట్లాడుతూ.. ఇంటాబయటా అంతా తెలుగులోనే మాట్లాడి, తెలుగులోనే సంతకం చెయ్యాలని, అప్పుడే తెలుగు భాషను బతికించుకుని.. నన్నయకు నిజమైన నివాళి అర్పించినవాళ్లం అవుతామన్నారు. సినీ నటుడు బ్రహ్మనందం మాట్లాడుతూ.. మహా భారతం గురించి అందరికీ తెలియజేయ్యాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో  రాశి కేర్స్ సంస్థ చైర్మన్ సుహాసిని తదితరులు పాల్గొన్నారు.