ఆధ్యాత్మికం: పాపాలే ఇంపుగా ఉంటాయి.. కురుక్షేత్ర యుద్దంలో అదే జరిగింది..! చివరకు ధర్మం.. పుణ్యమే గెలిచింది..

ఆధ్యాత్మికం: పాపాలే ఇంపుగా ఉంటాయి.. కురుక్షేత్ర యుద్దంలో అదే జరిగింది..!  చివరకు ధర్మం.. పుణ్యమే గెలిచింది..

పాపంబులు కర్జములని
యేపున చేయంగనవియు నింపగు; ధర్మ
వ్యాపారంబులకార్యము
లై పరిణతి! బొందెనేని నట్టుల చెల్లున్‌‌

నిత్యం పాపకార్యాలు చేసే స్వభావం ఉన్నవారికి, ఆ పాపాలు చేస్తున్నకొద్దీ ఇంపుగా ఉంటాయి. ధర్మకార్యాలు చేయరానివిగా భావిస్తే, అవి అయిష్టం అయిపోతాయని అర్థం. (మహాభారతం, విదురనీతి)

ధృతరాష్ట్రుడు విదురుడిని పిలిచి, తన మనశ్శాంతి కోసం నాలుగు మంచి మాటలు చెప్పమని కోరాడు. అప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడిని గట్టిగా మందలిస్తూ, పలు మంచి విషయాలు ప్రస్తావించాడు. 

కౌరవులు బాల్యం నుంచి పాపాలను చేస్తూనే ఉన్నారు. చేస్తున్నకొద్దీ ఇంకా చేయాలనిపిస్తూనే ఉంది. వాటినే పుణ్యకార్యాలుగా భావించారు. అందువల్లే వారికి వారు చేస్తున్న పాపాలన్నీ ఎంతో ఇంపుగా అనిపించాయి. ఏనాడూ ధర్మాన్ని ఆచరించాలనే ఆలోచనే వారికి కలగలేదు. అందువల్లే వారికి ధర్మకార్యాలు చేయరానివిగా అనిపించాయి. 

పాండవులు అరణ్యఅజ్ఞాతవాసాలలో ఉన్నప్పటికీ పుణ్యకార్యాలను ఆచరిస్తూనే ఉన్నారు. ఏనాడూ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు. రానున్న కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు మరణించటం తథ్యం. కౌరవులు పాండవులు కలిసి ఉంటే అది కురువంశానికే మంచి పేరు తీసుకువస్తుందని విదురుడు పలికాడు. 

కాని దుర్యోధనుడికి సూదిమొన మోపినంత స్థలం కూడా పాండవులకు ఇవ్వాలనిపించలేదు. రాజ్యమంతా తనదే అన్నాడు. తాను మంచి పనే చేస్తున్నానన్నాడు. అందుకు కర్ణుడు వంత పాడాడు. కాని చివరకు ఏం జరిగింది. 


యుద్ధంలో వంద మంది కౌరవులూ మరణించారు. బాల్యం నుంచి చేసిన పాపకర్మలకు తగ్గ ఫలితం లభించింది. భీష్మ, ద్రోణ, కృప, కర్ణ, అశ్వత్థామ వంటి యోధులతో పాటు పదకొండు అక్షౌ హిణీల సైన్యం ఉన్నప్పటికీ, ధర్మం వారి పక్కన లేకపోవడమే వారి వినాశనానికి కారణం అయ్యింది. నిత్యం పాప కర్మలతో కాలం గడిపారు. కురుక్షేత్ర యుద్ధంలో  ఆ పాపకర్మల ఫలితాన్ని అనుభవించారు. 

గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయేవారికి వడ్డించు బొమ్మ... అని తేలు గురించి ఒక పొడుపు కథ వాడుకలో ఉంది. తేలు నిత్యం అవతలి వ్యక్తిని కుడుతూనే ఉంటుంది. ఆ పాపపు పని చేసి, వెంటనే పాపకర్మ ఫలితంగా, ఎవరిని కుడుతుందో వారి చేతిలోనే మరణిస్తుంది. అకారణంగా అందరినీ బలంగా కుడుతూ చీమ తన పాపానికి ఫలితాన్ని తక్షణమే అనుభవించడం మనకి తెలిసినదే.

సువర్ణ గిరి రాజ్యాన్ని సుదర్శన వర్మ అనే రాజు పాలించేవాడు. ప్రజలు చేసే చిన్న చిన్న తప్పులకు కూడా పెద్ద పెద్ద శిక్షలు వేసేవాడు. ప్రజల నుంచి అక్రమంగా పన్నులు వసూలు చేసేవాడు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటీ చేసేవాడు కాదు. దానితో ప్రజలంతా కలిసి, తమ బాధను మంత్రికి విన్నవించుకున్నారు. అప్పటికే రాజు చేస్తున్న అరాచకాలను గమనించాడు మంత్రి. ప్రజలు కూడా తమ గోడు చెప్పుకోవడంతో, ‘రాజా! మీకొక చిన్న విన్నపం. ఈ రోజు మన ప్రజలు నా వద్దకు వచ్చి, వారి బాధలను నాకు విన్నవించుకున్నారు. 

ప్రజలలో తిరుగుబాటు వస్తే, ప్రభువుకు చేటు జరుగుతుంది. ప్రజల గురించి ఆలోచించండి ప్రభూ. మీరు ప్రతిదాని మీద పన్ను విధించడం వల్ల ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారు’ అని వివరించబోయాడు. అందుకు రాజు, ‘నేను విధించే పన్నులు ప్రజలకు మేలు చేయడం కోసమేగా. వారి నుంచి వసూలు చేసిన సొమ్మును వారికే వినియోగిస్తున్నాను. ఇందులో తప్పేముంది’ అంటూ కోపంగా పలికాడు. 

వాస్తవానికి వసూలు చేసిన పన్నులో సగ భాగం తన స్వలాభానికి వాడుకోవటానికి అలవాటుపడిన రాజు, తాను చేస్తున్న పాపకార్యాన్ని పుణ్యకార్యంగా పలికాడు. ఈ విధంగా సుమారు ఐదు సంవత్సరాలు గడిచింది. రాజులో ఎటువంటి మార్పు రాలేదు. రానురాను పన్నుల భారం పెరుగుతూ వచ్చింది. ఇక ప్రజలు భరించలేకపోయారు. వారిలో తిరుగుబాటు వచ్చింది. ఎలాగైనా ఈ రాజును పదవి నుంచి తప్పించాలనుకున్నారు. అందరూ కలిసి ఒక మంచి నాయకుడిని ఎన్నుకుని, మంత్రి సహాయంతో కలిసికట్టుగా పోరాడారు. చివరకు – రాజు పదవి నుంచి దిగిపోక తప్పలేదు.

 ధర్మకార్యాలు, సత్కార్యాలు చేస్తున్న వ్యక్తిని ప్రభువుగా ఎన్నుకున్నారు. అతని ఏలుబడిలో ప్రజలంతా హాయిగా జీవించసాగారు. కొత్తగా వచ్చిన రాజు ప్రజల బాగోగులు చూసుకుంటూ, అవసరమైన మేరకు మాత్రమే పన్నులు విధించి, ప్రజారంజకుడిగా నిలిచాడు. ధర్మకార్యాలు చేస్తూ, ప్రజల ప్రభువుగా నిలిచాడు. 

–డా. పురాణపండ వైజయంతి–