ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లా సంక్షిప్త వార్తలు

కోస్గి టౌన్, వెలుగు: మనఊరు– మనబడి పనులను ఆలస్యం చేస్తే ఊరుకునేది లేదని పేట కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులు కాంట్రాక్టర్లను హెచ్చరించారు.  శుక్రవారం కోస్గి పట్టణంలోని సీపీఎస్ స్కూల్‌ను విజిట్ చేశారు. ఇక్కడ మనఊరు-మనబడి కింద  చేపట్టిన  పనులు నెమ్మదిగా సాగుతుండడం గమనించిన ఆయన అధికారులపై మండిపడ్డారు.  15 రోజుల్లో పనులను పూర్తిచేయాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పట్టణంలోని బాహర్‌‌పేట్‌ హైస్కూల్‌ను పరిశీలించారు.  టాయిలెట్స్‌, అదనపు గదుల కొరత ఉందని హెచ్‌ఎం కలెక్టర్‌‌కు దృష్టికి తేగా.. అంచనా సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే సమీపంలోని సీపీఎస్ స్కూల్‌ పనులను పరిశీలించి ప్రహరీ నిర్మాణం చేపట్టాలని సూచించారు.  స్కూల్‌ సమీపంలోని మురుగు కాల్వ నుంచి దుర్వాసన వస్తుండడంతో  కమిషనర్‌‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడికి మొదటిసారి వచ్చారా..? వెంటనే క్లీన్‌ చేయించాలని ఆదేశించారు.  పట్టణంలోని ఉర్దూ మీడియం, -బ్రాహ్మణవీధిలోని ప్రైమరీ స్కూల్‌తో పాటు సర్జఖాన్‌ పేట, భోగారం, గుండుమాల్‌ స్కూళ్లలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. 

టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి

నారాయణపేట, వెలుగు:టీచర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని పీఆర్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డి చెప్పారు. శుక్రవారం నారాయణ పేట పట్టణంలోని సీఎన్‌ఆర్‌‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, మార్కెట్ లైన్, గ్రౌండ్, గర్ల్స్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ పాటు దామరగిద్ద  ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  టీచర్ల పదోన్నతులు, బదిలీలు, జీవో 317 సమస్యలు, స్పౌజ్ బదిలీలు,  బ్లాక్ చేయబడిన జిల్లా స్పౌజ్ సమస్యలు, కేజీబివీ టీచర్ల పే స్కేల్, ఆరోగ్య కార్డులు,  సర్వీస్ రూల్స్ తదితర సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.  తొలి ప్రాధాన్యత ఓటు తనకే వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌‌టీయూ జిల్లా అధ్యక్షుడు నర్సింహా రెడ్డి, ప్రధాన కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు లక్ష్మా రెడ్డి,  నారాయణపేట, దామరగిద్ద మండల భాద్యులు యం రఘువీర్, యం జనార్ధన్, సత్యనారాయణ రెడ్డి, విశ్వనాథ్ పాల్గొన్నారు.  

గ్రామాల్లో భగీరథ  నీళ్లొస్తలేవు

నవాబుపేట, వెలుగు:తమ గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీళ్లు రావడం లేదని దేపల్లి, తిమ్మాయిపల్లి సర్పంచులు ఎడ్ల లత, యాదమ్మ అధికారులపై మండిపడ్డారు. శుక్రవారం నవాబుపేటలో ఎంపీపీ అనంతయ్య అధ్యక్షతన మండల పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా దేపల్లి సర్పంచ్ మాట్లాడుతూ తమ గ్రామస్తుల దాహార్తి తీర్చేందుకు చెరువులో నుంచి బోరు మోటారు ద్వారా నీటిని పంపింగ్​ చేస్తున్నామని, ఇందుకోసం నెలకు రూ. 25వేల కరెంటు బిల్లు చెల్లిస్తున్నామని వాపోయారు.  తిమ్మాయిపల్లి సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో వారం రోజులుగా నీటి సరఫరా ఆగిపోయి జనాలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  కొల్లూరు పరిధిలోని సత్రోన్​పల్లి తండాలో వరల్డ్​బ్యాంకు నిధులతో ట్యాంక్‌ నిర్మించి 22 ఏండ్లు  దాటినా నీటి కనెన్షన్ ఎందుకు​ఇవ్వడం లేదని కొల్లూరు ఎంపీటీసీ తుల్సీరాంనాయక్ ఆర్‌‌డబ్ల్యూఎస్‌ డీఈ సురేశ్‌ను  నిలదీశారు.  జంగమయ్యపల్లిలో అంగన్​వాడీ వర్కర్​ అందుబాటులో ఉండడం లేదని,  ​​చౌడూరు అంగన్​వాడీ చిన్నారులకు మురికినీళ్లు తాగిస్తున్నారని ఆయా సర్పంచులు సీడీపీవో శాంతిరేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఈ కార్యక్రమంలో వైస్​ ఎంపీపీ సంతోష్, జడ్పీటీసీ రవీందర్‌‌ రెడ్డి, తహసీల్దార్ రాజేందర్​రెడ్డి, ఎంపీడీవో శ్రీలత,  మార్కెట్​ కమిటీ చైర్మన్​లక్ష్మణ్​, విండో చైర్మన్​ నర్సిములు పాల్గొన్నారు. 

కల్వకుంట్ల కుటుంబానికి జైలు తప్పదు

ఉప్పునుంతల, వెలుగు:అధికారాన్ని అండగా పెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకుంటున్న కల్వకుంట్ల కుటుంబానికి జైలు శిక్ష తప్పదని రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ రెడ్డి హెచ్చరించారు.  శుక్రవారం ఉప్పునుంతల మండలం తాడూరులో పార్టీ మండల అధ్యక్షుడు వావిలాల రమేశ్ అధ్యక్షతన మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చేనాటికి మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రాన్ని  సీఎం కుటుంబం, ఎమ్మెల్యేలు అప్పుల పాలు చేశారని మండిపడ్డారు.  కేసీఆర్‌‌ లిక్కర్ స్కామ్‌లో తన కూతురు ఎమ్మెల్సీ కవితను రక్షించేందుకే ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకు  తెర తీశారని ఆరోపించారు.  ఈ డ్రామాలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఎరగా వాడుకున్నాడని, ఆ విషయం తెలియక ఎమ్మెల్యే  కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి మరీ సన్మానాలు చేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని,  ఎన్నికలెప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.  ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి వేముల నరేందర్ రావు, అచ్చంపేట ఇన్‌చార్జి వీరెల్లి చంద్రశేఖర్, పార్లమెంట్ కన్వీనర్ కొండల్ రెడ్డి,  నేతలు సతీష్ మాదిగ, శ్రీకాంత్ భీమా,   శ్రీను నాయక్, సైదులు యాదవ్,  బ్రహ్మ చారి, తోళ్ల మహేశ్, ఎల్లన్న, కొత్త జగపతిరావు, బాల్ రెడ్డి, ప్రేమలతారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, సురేందర్ రెడ్డి, పుర్రు నిరంజన్ పాల్గొన్నారు. 

ధరణి సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి

కలెక్టర్ వల్లూరు క్రాంతి 

గద్వాల, వెలుగు: ధరణి సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టి వెంటవెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో ధరణి, భారత్ మాలపై సంబంధిత ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీఎం33, జీఎల్ఎం అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. గట్టు, కేటి దొడ్డి మండలాల్లో భారత్ మాల భూసేకరణలో 255 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఏ సర్వే నెంబర్లలోఎంత భూమి పోతుందని పక్కగా నివేదిక ఇవ్వాలన్నారు.  ఓటుహక్కుపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ ప్రతి ఓటరుకు ఆధార్ కార్డ్‌ లింక్ చేయాలని ఆదేశించారు. ప్రత్యేక ఓటర్ సవరణ జాబితాలో అర్హులందరూ ఓటు హక్కును 
పొందాలని సూచించారు.