కౌన్సిలరా.. మజాకా : సొంత పొలానికి మిషన్ భగీరథ నీళ్లు

కౌన్సిలరా.. మజాకా : సొంత పొలానికి మిషన్ భగీరథ నీళ్లు

మహబూబ్నగర్‍, వెలుగు:  తాగే నీళ్లు లేక పాలమూరు ప్రజల గొంతెండి పోతుంటే.. అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్‍ మాత్రం ఇంటింటికీ తాగునీళ్లందించే మిషన్ భగీరథ పైప్‍లైన్​నుంచి నీళ్లను అక్రమంగా తన పొలానికి మళ్లిస్తున్నాడు. మహబూబ్​నగర్ లో అధికార పార్టీ కౌన్సిలర్‍.. అందునా మంత్రికి ముఖ్య అనుచరుడు కావడంతో అధికారులు కూడా అటువైపు చూడటం మానేశారు. ఎండాకాలంలో బోర్లన్నీ ఎండిపోయి.. వానల కోసం కొసం రైతన్నలు కళ్లల్లో కాయలు పెట్టుకుని ఎదురు చూస్తుంటే.. ఈ కౌన్సిలర్‍ పొలం పచ్చగా ఉండటంతో అనుమానం వచ్చిన కొందరు మీడియాకు సమాచారం అందించారు. దీనిపై ‘వెలుగు’ ఆపరేషన్ చేపట్టగా.. భగీరథ పైప్ లైన్ ను అక్రమంగా కనెక్షన్ ఇచ్చుకుని .. 24గంటల పాటు నీళ్లు తరలిస్తున్న విషయం బయటపడింది.

ఎవ్వరికీ అనుమానం రాకుండా…

కోట్ల రూపాయలతో రామన్‍పాడు, కోయిల్‍సాగర్‍ ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వం ప్రతి ఇంటికీ మంచినీళ్లు అందించే ప్రయత్నంలో భాగంగా జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంనుంచి పైప్ లైన్ వేశారు. కౌన్సిలర్‍కు చెందిన పొలం పక్కనే ఈ పైప్ లైన్ వాల్వ్ ఉండటంతో అదే మంచి అవకాశంగా మలుచుకున్నాడు. ఎయిర్ వాల్వ్ బిగించిన సిమెంట్‍ కట్టడం అడుగు భాగంలో రంద్రం పెట్టి.. అండర్‍గ్రౌండ్‍ పైప్‍లైన్‍ ద్వారా తన పొలానికి నీళ్లు మళ్లిస్తున్నాడు. అనుమానం వచ్చిన కొందరు గమనించగా కౌన్సిలర్‍ నిర్వాకం బయటపడింది. అయితే ఈ తతంగంపై ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పలువురు స్థానికులు చెబుతున్నారు. మిషన్‍ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీళ్లు అందించాలనే ఉద్దేశ్యంతో నెలకు లక్షల రూపాయలు వెచ్చించి నీటిని ఫిల్టర్‍ చేస్తున్నారు. గుక్కెడు తాగునీళ్లకోసం అల్లాడుతున్న ప్రజలకు దక్కాల్సిన నీళ్లను దోచుకుంటున్న కౌన్సిలర్‍పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.