మహబూబాబాద్, వెలుగు: మానుకోట జిల్లాను డ్రగ్స్‌రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఎవరైనా మాదక ద్రవ్యాల రవాణా, వినియోగం చేస్తే ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు. వైద్య, ఆరోగ్యం, రెవెన్యూ, విద్య, అటవీ, డ్రగ్స్ ఇతర శాఖల అధికారులు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేయాలని తెలిపారు.
జిల్లాలోని రెవెన్యూ, మార్కెటింగ్, అటవీ, పోలీసు వివిధ చెక్‌పోస్టుల్లో పటిష్ట నిఘా పెట్టాలని కోరారు. డిగ్రీ, ఇంటర్మీడియట్‌కాలేజీల ప్రిన్సిపాల్స్, ఎంఈవోలతో అవగాహన కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. జిల్లాలో విస్తృత తనిఖీలు నిర్వహించాలని, మందుల ప్రిస్క్రిప్షన్లేకుండా మందులు పంపిణీ చేయవద్దని మెడికల్ షాపుల యజమానులకు తెలిపాలన్నారు.
సమావేశంలో డీఎస్పీ తిరుపతి రావు, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి కిరణ్ కుమార్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి దేశీ రామ్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారిని విజయ నిర్మల, డ్రెస్ ఇన్స్పెక్టర్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
