ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తాం : జి రవినాయక్​

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తాం : జి రవినాయక్​

మహబూబ్​నగర్​ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు మహబూబ్​నగర్​ కలెక్టర్​ జి రవినాయక్​ తెలిపారు. బుధవారం కలెక్టరేట్​లో మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. జిల్లాలో 835 పోలింగ్ కేంద్రాలతో పాటు 3 ఆక్సిలరీ పోలింగ్  స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. మహబూబ్ నగర్  నియోజకవర్గంలో 272 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మరో 3 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల కోసం ప్రపోజల్​ పెట్టామని చెప్పారు. 

జడ్చర్లలో 274, దేవరకద్రలో 289 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. మహబూబ్ నగర్ లో 2,52,318 మంది, జడ్చర్లలో 2,20,233 మంది, దేవరకద్రలో 2,35,147 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. 780 మంది సర్వీస్  ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఎస్పీ హర్షవర్ధన్  మాట్లాడుతూ పోలీస్ పెట్రోలింగ్, సీఏఎఫ్  బృందాల బందోబస్తు ఏర్పాటు చేశామని, మొదటి విడతలో రెండు కంపెనీల సీఏఎఫ్  బృందాలు జిల్లాకు వచ్చాయని, ఈ నెల 20న ఆరు కంపెనీల సీఏఎఫ్ బృందాలు వస్తాయని చెప్పారు. పోలింగ్  రోజు కర్నాటక రాష్ట్రం నుంచి 750 మంది పోలీసులు వస్తారని తెలిపారు. ఇప్పటివరకు రూ.3.55 కోట్లు, 2,600 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి..

గద్వాల: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని గద్వాల కలెక్టర్​ వల్లూరు క్రాంతి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటును డబ్బుకు, ఇతర ప్రలోభాలకు అమ్ముకోవద్దని కోరారు. సెక్షన్ 171బి ప్రకారం ఓటును అమ్ముకోవడం నేరమని తెలిపారు. సెక్షన్ 171సి ప్రకారం ఓటరును ప్రలోభ పెట్టడం నేరమన్నారు. ఎన్నికలకు సంబంధించిన కంప్లైంట్స్  ఉంటే సి విజిల్ యాప్, 1950 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అడిషనల్  కలెక్టర్  శ్రీనివాసులు, డీపీఆర్వో చెన్నమ్మ పాల్గొన్నారు.

ప్రతి ఇంటికి ఓటర్​ స్లిప్..

వనపర్తి: ఓటర్​ స్లిప్పులను నేరుగా ఓటర్లకు అందజేస్తామని కలెక్టర్  తేజస్  నంద్ లాల్  పవార్  తెలిపారు. బుధవారం వనపర్తి ఐడీవోసీలో ఎస్పీ రక్షిత కె మూర్తి, రిటర్నింగ్  ఆఫీసర్​ తిరుపతిరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నిఘా ఏర్పాటు చేశామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 81 శాతం పోలింగ్  నమోదైందని, ఈ సారి పోలింగ్ శాతం మరింత పెంచుతామని చెప్పారు. అంతకు ముందు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 

కౌంటింగ్ కు సిద్ధం కావాలి..

నాగర్ కర్నూల్ టౌన్: వచ్చే నెల 3న నిర్వహించే ఎన్నికల కౌంటింగ్ ను పక్కాగా నిర్వహించేందుకు సిబ్బంది సిద్ధం కావాలని అడిషనల్​ కలెక్టర్  కె. సీతారామారావు సూచించారు. కలెక్టరెట్  మీటింగ్  హాలులో పోలింగ్, వ్యవసాయ మార్కెట్  యార్డులో సహాయ కౌంటింగ్ సూపర్​వైజర్లు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్  సిబ్బంది నిష్పక్షపాతంగా ప్రక్రియను నిర్వహించాలని, ఎన్నికల కమిషన్​ నిబంధనలు పాటించాలని సూచించారు. మైక్రో అబ్జర్వర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.