పేదల తిరుపతి ‘కురుమూర్తి జాతర’..పోటెత్తిన భక్తులు

పేదల తిరుపతి ‘కురుమూర్తి జాతర’..పోటెత్తిన భక్తులు

‘పేదల తిరుపతి’గా పేరొందిన కురుమూర్తి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు జనం పోటెత్తుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమరచింత (అమ్మాపూర్‌)లో కురుమూర్తి స్వామి కొలువై ఉన్నాడు. అక్టోబర్ 26న ప్రారంభమైన కురుమూర్తి బ్రహ్మోత్సవాలు దాదాపు నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. తెలంగాణలోని మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున జాతరకు తరలి వస్తున్నారు. అయితే ఈ జాతరలో వెరీ వెరీ స్పెషల్.. ఇక్కడ లభించే మాంసాహార వంటకాలు. భక్తులంతా స్వామివారిని దర్శించుకున్న తర్వాత తప్పకుండా ఇక్కడి హోటళ్లలో మాంసాహారాన్ని తినడం ఆనవాయితీగా వస్తోంది.    

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి జాతర అనగానే భక్తులకు మహిమ గల దైవం గుర్తుకొస్తాడు. ఆ తర్వాత అమరచింతలో లభించే చికెన్ కబాబ్, మటన్ కబాబ్, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, మటన్ కీమా, గ్రిల్ మటన్ గుర్తుకొస్తాయి. దైవ దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత.. భక్తులు తమ కుటుంబాలతో స్థానికంగా ఉండే హోటళ్లకు వెళ్తారు. అక్కడ రుచికరమైన మాంసాహారాన్ని తింటారు.

ఇక్కడి హోటళ్ల వాళ్లు జాతర కోసం దాదాపు రెండు నెలల ముందు నుంచే ప్రిపరేషన్ మొదలుపెడ్తారు. గ్రిల్ మటన్, వెరైటీ చికెన్ వంటకాల తయారీ కోసం దాదాపు 18 రకాల మసాలాలను తయారుచేసి సిద్ధంగా ఉంచుకుంటారు. స్థానికంగా ఉండే మటన్ షాపుల వాళ్లు వందలాది మేకలు, గొర్రెలను కొని పెట్టుకుంటారు. దీన్నిబట్టి ఈ జాతర వేళ మాంసాహారానికి ఎంత గిరాకీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

కురుమూర్తి స్వామిని పూజలతో ప్రసన్నం చేసుకున్నాక.. భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా మాంసాహారాన్ని తింటారని స్థానికులు తెలిపారు. జాతర సందర్భంగా వందలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. ఈనేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం కురుమూర్తి జాతరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.  సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత తెలంగాణలో ఎక్కువ రోజుల పాటు జరిగేది కురుమూర్తి జాతరే. దీనికి దాదాపు 800 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు. కురుమూర్తి స్వామి ఆలయాన్ని 1350వ దశకంలో నిర్మించారని అంటారు.