రూపాయి ఖర్చు చేసినా పారదర్శకంగా ఉండాలి: ప్రభుత్వ విప్యెన్నం శ్రీనివాస్ రెడ్డి

రూపాయి ఖర్చు చేసినా పారదర్శకంగా ఉండాలి: ప్రభుత్వ విప్యెన్నం శ్రీనివాస్ రెడ్డి
  •    ప్రభుత్వ విప్​యెన్నం శ్రీనివాస్​ రెడ్డి
  •     రసాభాసాగా మారిన తొలి బడ్జెట్​ సమావేశం
  •     ప్రొటోకాల్​ పాటించలేదని బీఆర్​ఎస్​ సభ్యుల వాకౌట్​

మహబూబ్​నగర్, వెలుగు :  రూపాయి ఖర్చు చేసినా పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వ విప్​, మహబూబ్​నగర్​  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. మందిరంలో శనివారం ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ  బడ్జెట్, కౌన్సిల్​ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే బీఆర్​ఎస్​ పార్టీకి చెందిన సభ్యులు ఆందోళనకు దిగారు. వేదికపై మేయర్​ మమత కుర్చి పక్కనే ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి​, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్​ రెడ్డి, ఇతర అధికారులు కూర్చీలు వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రూల్​ ప్రకారం వేదికపై మేయర్​కు మాత్రమే కుర్చి ఉండాలని, మిగతా వారికి కుర్చి వేయడమంటే మేయర్​ను అవమానించినట్లేనని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే కలగజేసుకున్న కమిషనర్​ పరిస్థితులను బట్టి వేదికపై కుర్చీలు ఏర్పాటు చేయొచ్చు అని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా బీఆర్​ఎస్​ సభ్యులు మొండికేశారు. ఇందుకు నిరసనగా ఆ పార్టీ కౌన్సిల్​ సభ్యులు సమావేశం నుంచి వాకౌట్​ చేశారు. అనంతరం మేయర్ 2026-–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనా బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను ప్రవేశపెట్టారు.

 అనంతరం  ప్రభుత్వ విప్​ మాట్లాడుతూ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. పాలమూరు కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌గా మారిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ కావడంతో దీన్ని సమర్థవంతంగా అమలు చేసి నగరానికి అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామన్నారు. ఆస్తి పన్నుల వసూళ్లు వంద శాతం జరిగితేనే ప్రతీ డివిజన్‌‌‌‌‌‌‌‌లో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అనంతరం ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యేను కార్పొరేటర్లు సన్మానించారు. కాగా.. సమావేశంలో మైనార్టీ వర్గానికి చెందిన కార్పొరేటర్లు ఎజెండా పత్రాలకు తెలుగులో ఉండడం వల్ల అర్థం కావడం లేదని, ఉర్దూలో కూడా ముద్రించాలని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు బీజేపీ సభ్యులు స్పందిస్తూ, తమకు ఎజెండా అంశాలను సంస్కృతం భాషలో ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ మధుసూదన్ నాయక్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మున సిపల్ కార్పొరేషన్ అధికారులు 
పాల్గొన్నారు.